ఎల్బీనగర్, జూన్ 11: వర్షాకాలంలో చెరువులు ప్రమాదకరంగా మారడం, పరిస్థితులు చేయిదాటితే పల్లపు ప్రాంతాలు ముంపునకు గురికావడం, ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా, చెరువుల రక్షణకు లేక్ గార్డులను ఏర్పాటు చేశారు. చెరువుల వద్ద కాపలా కాస్తూ చెరువులో నీటి మట్టాన్ని పరిశీలించి ఎప్పటికప్పుడు సమచారం అందించడంతో పాటు ప్రమాదకర పరిస్థితులను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఈ లేక్ గార్డులు అందుబాటులో ఉండనున్నారు. జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోన్ పరిధిలోని కాప్రా, ఉప్పల్, హయత్‌నగర్, ఎల్బీనగర్, సరూర్‌నగర్ సర్కిళ్ల పరిధిలోని 20 చెరువుల సంరక్షణ కోసం 40 మంది లేక్ గార్డులను నియమించారు.
అదే విధంగా ఎల్బీనగర్ జోన్ పరిధిలోని 20 చెరువులకు గేట్లు ఏర్పాటు చేస్తున్నామని, చెరువుల వద్ద గార్డుల ఏర్పాటుతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గం వ్యాప్తంగా వర్షాకాలంలో వరదనీటి ముంపు సమస్య రాకుండా సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నిర్మిస్తున్న బాక్స్ డ్రైన్ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. ఈ పనులపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, జోనల్ కమిషనర్ పంకజ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ పనులు వేగంగా జరిగేలా చొరవ తీసుకుంటున్నారు.
హెచ్చరిక బ్యానర్లు
చెరువులు, నాలాల వద్ద ప్రమాదాలు చోటు చేసుకోకుండా చుట్టూరా మెష్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు నాలా ప్రమాదకరం అంటూ హెచ్చరిక బ్యానర్లును ఏర్పాటు చేశారు.
లేక్ గార్డులు.. సీసీ కెమెరాలు
ఎల్బీనగర్ జోన్ పరిధిలోని చెరువుల సంరక్షణ కోసం లేక్ గార్డులను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 20 చెరువులకు గాను ఒక్కో చెరువుకు ఇద్దరు చొప్పున 40 మంది లేక్ గార్డులు పనిచేస్తున్నారు. అంతేకాక చెరువుల నుంచి నీరు వెళ్లే ప్రాంతాల్లో గేట్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో చెరువుల నీటి మట్టం వివరాలతో పాటు ప్రమాదాలను గుర్తించేందుకు లేక్ గార్డులతో పాటు సీసీ కెమెరాలను కూడా అమర్చుతున్నాం. ఇక చెరువులతో పాటు నాలాలు, పెద్ద డ్రెయిన్ల వద్ద మెష్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు వర్షాకాలంలో ప్రమాదాలు చోటు చేసుకోకుండా ‘ఇక్కడ నాలా ఉంది.. అప్రమత్తంగా ఉండాలంటూ’ సూచన బ్యానర్లు కూడా ఏర్పాటు చేశాం.
– ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ