మైలార్ దేవపల్లి, జూన్ 11: మైలార్ దేవపల్లి ప్రధాన రహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్ పేర్కొన్నారు. మైలార్ దేవపల్లి డివిజన్ పరిధిలోని ప్రజాభవన్ నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ స్థల పరిశీలన చేశారు. ప్రతి రోజు ట్రాఫిక్ జామ్‌లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే ట్రాఫిక్ ఇబ్బందులపై హెచ్ఎండీఏ దృష్టికి తీసుకెళ్లారు. హెచ్ఎండీఏ సీఈ బీఎల్ఎన్ రెడ్డి, ఈఈ అప్పారావుతో కలిసి శనివారం పల్లె చెరువు నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు రోడ్డుపై వాహనాల రద్దీని పరిశీలించారు. ఈ మార్గంలో రెండు సిగ్నల్స్ ఉండటంతో కేవలం రెండు కిలోమీటర్ల వెల్లాలంటే 20 నిమిషాల వ్యవధి పడుతుందని అధికారులకు వెల్లడించారు. వాహనదారులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజాభవన్ నుంచి ఆరాంఘర్ వరకు ఫ్లైఓవర్ నిర్మాణానికి ఎస్టిమేషన్ వేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. ఫ్లె ఓవర్ బ్రిడ్జీ నిర్మాణం చేపడితే మైలార్దేవపల్లి వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని అన్నారు. డివిజన్ అధ్యక్షుడు టి.ప్రేమ్‌దాస్ గౌడ్, అమరేందర్ పాల్గొన్నారు.