బంజారాహిల్స్/ఖైరతాబాద్/హిమాయత్‌నగర్,జూన్ 11: పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఒకవైపు వ్యర్థాల తొలగింపుతో పాటు స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జీహెచ్ఎంసీ సర్కిల్ -18 పరిధిలో జీహెచ్ఎంసీ ప్రత్యేక బృందా లు ముమ్మరంగా పనిచేస్తున్నాయి. మరోవైపు ఎంటమాలజీ విభాగం సిబ్బంది దోమల నివారణ కోసం చర్యలు చేపట్టారు. వీటికి తోడు పలు ప్రాంతాల్లో పనిచేయని వీధి దీపాలను మరమ్మతులు చేస్తున్నారు. బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని కాజానగర్, బోళానగర్ తదితర బస్తీల్లో పలు వీధిదీపాలు పనిచేయడం లేదని స్థానికులు ఫిర్యాదులు చేశారు. దీంతో శనివారం జీహెచ్ఎంసీ స్ట్రీట్ లైట్స్ విభాగం సిబ్బంది బస్తీల్ల్లో పర్యటిస్తూ పనిచేయని వీధిదీపాలను మార్చారు.
మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి
ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు హిమాయత్‌నగర్ కార్పొరేటర్ జి.మహాలక్ష్మి తెలిపారు. శనివారం హిమాయత్ నగర్, విఠల్‌వాడీ,నారాయణగూడ ప్రాంతాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేరుకుపోయిన మట్టికుప్పలు తొలగింపు,చెట్టు కొమ్మల కొట్టివేత,రోడ్డు ప్యాచ్‌వర్కు పనులు,పారిశుద్ధ్య నిర్వహణ, లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలవడం వంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆమె సూచించారు.
వర్షపునీరు, సీవరేజ్ లైన్‌ను సరిచేయాలి
ఖైరతాబాద్ డివిజన్లోని గాంధీనగర్‌లో సీవరేజీ, వర్షపునీటి లైను సరిచేయాలని కార్పొరేటర్ పి. విజయారెడ్డి అధికారులను కోరారు. గాంధీనగర్‌లో జీహెచ్ఎంసీ ఏఈ చరణ్, వాటర్ వర్క్స్ మేనేజర్ స్వామి, శానిటేషన్, హార్టికల్చర్, ఎంటమాలజీ సిబ్బందితో కలిసి పర్యటించారు. స్థానికులు పలు సమస్యలను కార్పొరేటర్‌కు వివరించారు. సీవరేజీ, వర్షపునీటి లైన్లు వేర్వేరుగా వేసి సమస్యను పరిష్కరించాలని కార్పొరేటర్ అధికారులను కోరారు. అనంతరం దోమల నివారణపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అంజయ్య, మల్లేష్, రాజ్ కుమార్, కన్నా పాల్గొన్నారు.