బన్సీలాల్‌పేట్, జనవరి 31 : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కోట్లాది రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి పనులను చేపడుతున్నామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం బన్సీలాల్‌పేట్ కార్పొరేటర్ కె.హేమలత, జీహెచ్ఎంసీ నార్త్ జోన్ కమిషనర్ బి.శ్రీనివాస్ రెడ్డి, డీసీ ముకుందరెడ్డి, సికింద్రాబాద్ తాసీల్దార్ బాలశంకర్, జలమండలి జీఎం రమణారెడ్డితో కలిసి బన్సీలాల్‌పేట్ డివిజన్లో రూ.1.75 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు బస్తీల్లో స్థానికులు పటాకులు కాల్చి ఘనస్వాగతం పలికారు. మంత్రి, కార్పొరేటర్‌కు శాలువాలు కప్పి సన్మానించారు. పద్మారావునగర్‌లోని జీహెచ్ఎంసీ ప్రధాన పార్కులో నిర్మించిన గజేబోను ప్రారంభించారు. పద్మారావునగర్‌లోని ఈశ్వరమ్మ బస్తీలో రూ.24.13 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు, ఎన్టీఆర్ విగ్రహం వద్ద రూ.13.90 లక్షలతో సీవరేజి పైపులైన్ పనులు, వెంకటాపురం పార్కు వద్ద రూ.22.50 లక్షలతో సిమెంట్ రోడ్డు, ముస్లిం వక్ఫ్ బోర్డు బస్తీలో రూ.11.50 లక్షలతో సిమెంట్ రోడ్డు పనులను మంత్రి ప్రారంభించారు. తాము 60 ఏండ్ల నుంచి నివసిస్తున్నామని, తమకు ఇండ్లను రెగ్యులరైజ్ చేయాలని, సొంతంగా ఇండ్ల నిర్మాణం చేసుకోవడానికి వీలుగా ప్రభుత్వం ద్వారా రుణాలను ఇప్పిం చాలని బస్తీవాసులు మంత్రిని కోరారు. మంత్రి స్పందించి.. అక్కడే ఉన్న సికింద్రాబాద్ తాసీల్దార్ బాలశంకర్‌ను పిలిచి బస్తీ భూమికి సంబంధించిన సమగ్ర నివేదికను తనకు వీలైనంత త్వరగా అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్ర మంలో టీఆర్ఎస్ ఇన్చార్జి జి.పవన్‌కుమార్ గౌడ్, అధ్యక్షుడు వెంకటేశన్రాజు, నాయకులు లక్ష్మీపతి, ఏసూరి మహేశ్, పద్మారావునగర్ పార్కు వాకర్స్ అసోసియేషన్ నాయకులు, వివిధ బస్తీలు, కాలనీల ప్రతినిధులు పాల్గొన్నారు.