జవహర్నగర్, జూన్ 7: తెలంగాణ రాష్ట్రంలోని పేదల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి బస్తీ దవాఖానలు, పల్లె దవాఖాలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి వైద్యం అందించాలనే సంకల్పంతో పని చేస్తున్నదని సీఎంఓ ఓఎస్డీ డాక్టర్ ఆచార్య గంగాధర్ పేర్కొన్నారు. జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలోని హైదరాబాద్ బిట్స్ పిలానీలో ఈఎస్టీ, టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ బిట్స్ ఫిలానీ ఏఏపీఎం సంయుక్త ఆధ్వర్యంలో కచ్చితత్వ ఔషధం- డిజిటల్ ఆరోగ్య రంగంలో నిపుణులతో జాతీయ స్థాయి ‘ప్రిసిషన్ మెడిసన్’ జాతీయ సదస్సు మంగళవారం జరిగింది.
ఈ సదస్సు ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. తెలంగాణలోని పౌరులందరికీ ఆరోగ్య ప్రొఫైల్ను తయారు చేసేందుకు సిరిసిల్ల, ములుగు జిల్లాలను ఫైలెట్ ప్రాజెక్టులో భాగంగా ప్రతి ఒక్కరి ఆరోగ్య ప్రొఫైల్ను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ పూర్తయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. పౌరుల ఆరోగ్యం చికిత్సా విధానాన్ని తెలుపేందుకు ఆరోగ్య ప్రొఫైల్ డేటా దోహదపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వైద్య కళాశాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు.
కచ్చితమైన మందులతో పాటు రోగ నిర్ధారణ సహాయాన్ని మెరుగు పర్చడానికి రాష్ట్ర వ్యాప్తంగా డయాగ్నొస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నదని పేర్కొన్నారు. ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం మంచి వాతావరణాన్ని సృష్టిస్తున్నదని, అందుకు అనుకూలంగా వైద్య సంస్థలు కృషి చేయాలని కోరారు. అనంతరం, సదస్సులో పాల్గొన్న వారికి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఏపీఎం సీఈవో డాక్టర్ ప్రసూన్ మిశ్రా, వక్తలు శ్రీఉదయ్ చటర్జీ, డాక్టర్ కల్యాణ్, డాక్టర్ హిమ చల్లా, డాక్టర్ అనూ ఆచార్య డాక్టర్ లిష్కేశ్, భరత్ పాల్గొన్నారు.