సిటీబ్యూరో, జూన్ 1 (నమస్తే తెలంగాణ ): జీహెచ్ఎంసీ పరిధిలో ఈ నెల 3 నుంచి 18వ తేదీ వరకు చేపట్టే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో విజయవంతం చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. జీహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి మంత్రి తలసాని పట్టణ ప్రగతి ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, దానం నాగేందర్, జాఫర్ హుస్సేన్, కౌసర్ మోహినుద్దీన్, మోజమ్ ఖాన్, రాజాసింగ్, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, భూపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, కమిషనర్ డీఎస్.లోకేశ్‌కుమార్, విద్య మౌలిక సదుపాయాల కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్, జోనల్, డిప్యూటీ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.
గ్రేటర్ వ్యాప్తంగా 150 వార్డుల్లో..
మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ గ్రేటర్ వ్యాప్తంగా 150 వార్డుల్లోని 4846 కాలనీల్లో నియమించిన 391 బృందాలు, జీహెచ్ఎంసీ సిబ్బంది ద్వారా కాలనీల్లో చెత్త సేకరణ, నాలాల పూడికతీత, ప్రభుత్వ దవాఖానలు, ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లలో పరిశుభ్రత, దోమల నివారణకు ఫాగింగ్, స్ప్రేయింగ్ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. వీధి కుకల వల్ల కాలనీ వాసులకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేలా, వీధి లైట్లు సక్రమంగా వెలిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగేలా, చెత్త తరలింపునకు వాహనాలు అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. వాహనాల డ్రైవర్ల నంబర్లను శాసన సభ్యులకు అందజేయాలన్నారు. అవసరమైతే అదనపు వాహనాలు సమకూర్చాలని ఆదేశించారు.
వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా..
రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని ఆదేశించారు. లంగర్‌హౌస్ చెరువు సుందరీకరణ మాదిరిగానే షాతం చెరువులో గుర్రపు డెక తొలగించి సుందరీకరణ పనులు చేపట్టాలని సూచించారు. వందశాతం నాలాల్లో పూడికతీత చేపట్టాలన్నారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కౌసర్ మొహియుద్దీన్ సూచనల మేరకు హకీం దర్గా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు మంత్రి తలసాని సూచించారు.
కారుణ్య నియామకాలు చేపట్టాలి
డివిజన్ల వారీగా పదవీవిరమణ పొందిన ప్రభుత్వ పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టేందుకు నిర్ణయం తీసుకోవాలన్నారు. అన్ని వార్డుల్లో భవన నిర్మాణ వ్యర్థాలు, గ్రీన్ వేస్ట్, క్యాచ్ పిట్ తదితర సమస్యలకు పరిషారం చూపాలని తెలిపారు. వారంలో మూడు సార్లు జోనల్, డిప్యూటీ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిషరించాలని సూచించారు.
సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలి : మేయర్ గద్వాల
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా అన్ని కాలనీల్లో భవన నిర్మాణ వ్యర్థాలు, నాలాల పూడికతీత, పారిశుధ్య పనులు నిరంతరాయంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులకు సూచించారు. కాలనీల్లో నెలకొన్న చిన్న, చిన్న సమస్యలను గుర్తించి వెంటనే పరిషరించాలని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి చెప్పారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సలహాలు
తీసుకోవాలి: హోంమంత్రి
పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని హోంమంత్రి మహమూద్ అలీ అధికారులకు సూచించారు. కాలనీల్లో పర్యటించి సమస్యలను తెలుసుకొని పరిషరించాలని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సలహాలు తీసుకుని వారు లేవనెత్తిన సమస్యలను వెంటనే పరిషరించాలని ఆదేశించారు.