చార్మినార్, జూన్ 1 : తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి చిహ్నమైన బోనాల ఉత్సవాలను ఆషాఢ మాసంలో ఘనంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామని భాగ్యనగర్ బోనాల ఉత్సవ ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు, జగదాంబ దేవాలయ ట్రస్టీ రాకేశ్ తివారీ తెలిపారు. బుధవారం సుల్తాన్‌షాహీ జగదాంబ దేవాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ప్రధాన కార్యదర్శి ఎస్.పి. క్రాంతి కుమార్‌తో కలిసి ఆయన మాట్లాడుతూ.. గత రెండేండ్ల కాలంగా కరోనా ఆంక్షలతో బోనాల ఉత్సవాలను ఆశించిన స్థాయిలో నిర్వహించలేకపోయామని తెలిపారు. ఈసారి భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీల ఆధ్వర్యంలో ఆషాఢ మాసం బోనాలను మరింత వైభవంగా నిర్వహించనున్నామని తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా సప్తమాతృకలకు బంగారు బోనాలను సమర్పించే సంప్రదాయాన్ని కొనసాగించనున్నామని చెప్పారు.
ప్రథమ ఘట్టంగా జూన్ 30న గోల్కొండ కోటలోని జగదాంబ అమ్మవారికి బంగారు బోనం సమర్పణతో బోనాల ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని తెలిపారు. జూలై 15న ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీల్లోని దేవాలయాల్లో కలశ స్థాపనతో పాతనగరంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. జూలై 24న జరిగే బోనాల ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 8 ప్రధాన దేవాలయాలకు పట్టు వస్ర్తాలను అధికారులు అందజేయనున్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు ఎం. కృష్ణ, కార్యదర్శులు జి. రాహుల్, ఎస్.ఆనంద్, సభ్యులు లెనిన్ బాబు, కృష్ణారావు, కె. దినేశ్, డి. రాజ్‌కుమార్, డి.ఆనంద్ గుప్తా, జ్యోతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.