మెహిదీపట్నం, జూన్ 1 : ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను పాటించేలా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. వాహనదారులు అడ్డదిడ్డంగా వాహనాలను నడుపుతూ ఇతరుల ప్రాణాలకు ప్రమాదాలను కల్గిస్తున్నారు. దీనిపై వాహనదారుల్లో అవగాహన పెంచి వారితో నిబంధనలను పాటించేలా ట్రాఫిక్ పోలీస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో మే 19న పిల్లర్ నం.92 వద్ద రాంగ్రూట్లో బైక్‌పై వెళ్తున్న ఇంటర్ చదివే విద్యార్థిని మరో వాహనదారుడు ఢీ కొనడంతో అతడు తీవ్రగాయాలతో మృతి చెందాడు. దీంతో టోలిచౌకి ట్రాఫిక్ పోలీసులు లంగర్‌హౌస్ రింగ్ రోడ్ నుంచి పిల్లర్ నం. 92 వరకు వాహనాల వారిని ప్రమాదాలు జరుగకుండా ఆపడానికి చర్యలు చేపట్టారు. వాహనాలను తనిఖీలు చేయడం, రాంగ్ రూట్లో ప్రయాణించకుండా అడ్డుకట్ట వేయడం, మైనర్ డ్రైవింగ్ చేస్తున్న వాహనదారులను ఆపి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ట్రాఫిక్ నిబంధలను ఉల్లఘించి వాహనాలను నడుపుతున్న వారిని గుర్తించి వారి వద్ద చలాన్లను వసూలు చేస్తున్నారు.
ప్రమాదాలను నివారించడానికి తనిఖీలు..
వాహనాల ప్రమాదాలు జరుగడానికి మద్యం తాగి వాహనాలను నడపటం ఒక కారణంగా పేర్కొనవచ్చు. ఈ ప్రమాదాలను నివారించడానికి టోలిచౌకి ట్రాఫిక్ పోలీసులు తరచూ తనిఖీలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా శివారుల నుంచి నగరంలోకి వచ్చే వారిని లంగర్‌హౌస్ సంగం సమీపంలో ఆపి డ్రంకన్ అండ్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నారు. దీంతో వాహనదారులలో అప్రమత్తత పెరుగుతున్నట్లు టోలిచౌకి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శంకర్ రెడ్డి తెలిపారు. వారంలో నాలుగు రోజుల పాటు డ్రంక్ అండ్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నామని దీని వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గాయని అంటున్నారు.
కౌన్సెలింగ్ ఇస్తూ.. అవగాహన కల్పిస్తున్నాం
వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. లైసెన్స్, వాహనం సంబంధిన పత్రాలు దగ్గర ఉంచుకోవాలి. ద్విచక్ర వాహన దారులు హెల్మెంట్ ధరించాలి. కారులో ప్రయాణించేవారు విధిగా బెల్ట్ పెట్టుకోవాలి. రాంగ్రూట్లో వాహనాలను నడుపకుండా చర్యలు తీసుకుంటున్నాం. లంగర్‌హౌస్, నానల్‌నగర్, టోలిచౌకి ప్రాంతాల్లో వాహనదారులకు తనిఖీలు చేస్తున్న సమయంలో కౌన్సెలింగ్ ఇస్తూ నిబంధనలను వివరిస్తున్నాం.
– శంకర్‌రెడ్డి, ఇన్స్పెక్టర్,టోలిచౌకి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్