బంజారాహిల్స్, మే 20 : జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రధాన రహదారులు, చౌరస్తాలు సరికొత్త సొబగులతో ఆకట్టుకుంటున్నాయి. జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో షేక్‌పేట కొత్త చెరువు నుంచి ఫిలింనగర్‌కు వెళ్లే రోడ్డులో రూ.40లక్షల వ్యయంతో సుమారు 300మీటర్ల మేర నిర్మించిన సెంట్రల్ మీడియన్‌ను యూబీడీ విభాగం అధికారులు సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రూ.12లక్షల వ్యయంతో ఆకర్షణీయమైన మొక్కలను ఏర్పాటు చేసి వాటి మధ్యన వాకింగ్ ట్రాక్‌ను నిర్మించారు. చిత్ర పరిశ్రమకు కేంద్రంగా పేరొందిన ఫిలింనగర్ ప్రాంతం విశిష్టతను తెలిపేలా సెంట్రల్ మీడియన్‌లో శిల్పాలు ఏర్పాటు చేశారు. సుమారు రూ.10లక్షల వ్యయంతో నాలుగు భారీ శిల్పాలు ఏర్పాటు చేయడంతో కొత్త అందాలు సంతరించుకున్నది. సినిమా షూటింగ్స్‌కు ఉపయోగించే కెమెరా ఆకృతులు, సినిమాల్లోని ఫైటింగ్ సీన్లు, సన్నివేశాలను తలపించేలా మరికొన్ని శిల్పాలను ఏర్పాటు చేశారు. దీంతో ఈ రోడ్డునుంచి వెళ్లే వాహనదారులు సరికొత్త అనుభూతిని పొందుతున్నారు.

