హైదరాబాద్, ఆట ప్రతినిధి, మే 20: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సే నో టూ డ్రగ్స్’ ప్రచారంలో భాగంగా వచ్చే నెల 2, 3వ తేదీల్లో తెలంగాణ క్రికెట్ కప్ టోర్నీని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్) ఆధ్వర్యంలో జరుగనున్న క్రికెట్ టోర్నీ లోగో, ట్రోఫీలతో పాటు పోస్టర్‌ను క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం’ సందర్భంగా క్రికెట్ టోర్నీని నిర్వహించడం బాగుందన్నారు. రాష్ర్టాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు సీఎం కేసీఆర్ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. డ్రగ్స్ వల్ల జరిగే అనర్ధాల పట్ల యువత, క్రీడాకారులకు అందరికీ అవగాహన కల్పించేందుకు ప్రచారం నిర్వహిస్తున్నాం అని అన్నారు. ఈ టోర్నీలో టీజీవో, టీఎన్జీవో, సీపీ హైదరాబాద్, సినీ స్టార్స్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డాక్టర్స్ లెవెన్, సివిల్ సర్వీసెస్ జట్లు బరిలోకి దిగుతున్నాయి. ట్రోఫీ, పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, టీజీవో అధ్యక్షురాలు మమత, రవీందర్ కుమార్ గౌడ్, కృష్ణ యాదవ్ పాల్గొన్నారు.