బేగంపేట్, మే 20: స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నేతలు మహాత్మాగాంధీ పేరును ఉపయోగించుకోవడం దుర్మార్గపు, నీచమైన ఆలోచన అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. సికింద్రాబాద్ ఎంజీ రోడ్డు మహాత్మాగాంధీ విగ్రహాన్ని తొలగిస్తున్నారనే తప్పుడు ప్రచారంతో కాంగ్రెస్ నేతలు రాజకీయంగా పబ్బం గడుపుకోవాలనే దురుద్దేశంతో ధర్నాలు చేస్తున్నారని అన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన గాంధీ అంటే తమకు ఎంతో గౌరవం ఉందని, అందుకే గాంధీ కూడలిని నగరంలోనే అత్యంత సుందరంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడితే కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తూ ధర్నా చేయడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసిన జస్టిస్ అమర్నాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, అంజయ్య గౌడ్ కుటుంబ సభ్యుల సంప్రదింపులతోనే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించారు. ప్రస్తుతం ఉన్న పార్క్ ప్రాంతాన్ని మరింత విస్తరించి రూ.60 లక్షలతో సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దడం కోసం చర్యలు చేపట్టినట్టు తెలిపారు.