మేడ్చల్ కలెక్టరేట్, మే 18 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకంతో ప్రజల తాగునీటి కష్టాలు తీరాయి. ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరు వస్తుండటంతో ప్రజల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో ఉమ్మడిపాలనలో తాగునీటి కష్టాలు వర్ణణాతీతం.చాలామంది డబ్బులు చెల్లించి ట్యాంకర్ల ద్వారా కొనుగోలు చేసేవారు. కేసీఆర్ మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఇంటింటికీ తాగునీరు అందించడంతో ప్రజలకు నీటి గోస తప్పింది.
నాగారం మున్సిపాలిటీలో…
నాగారం మున్సిపాలిటీ పరిధిలోని నాగారం, రాంపల్లిలో మొత్తం ఇండ్లు 16వేల 764 ఉండగా… 12వేల 500 ఇండ్లకు నల్లా ద్వారా 15 వాటర్ ట్యాంకులతో 45 లక్షల లీటర్ల మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నారు. మున్సిపాలిటీలో 150 కాలనీల్లో 105 కిలోమీటర్ల మేర పైపులైన్ పనులు పూర్తి చేసి తాగునీరు అందిస్తున్నారు.
దమ్మాయిగూడ మున్సిపాలిటీలో…
దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని దమ్మాయిగూడ, బండ్లగూడ, కుందన్‌పల్లి, రాజీవ్‌గృహకల్ప కాలనీలో 18వేల178 ఇండ్లు ఉండగా… 14వేల 400 ఇండ్లకు 15 వాటర్ ట్యాంకుల ద్వారా 40 లక్షల లీటర్ల నీటిని ప్రతి రోజు సరఫరా చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో 88 కిలో మీటర్ల మేర పైపులైన్ పనులు పూర్తి చేసి కాలనీల్లో ప్రజలకు తాగునీరు అందిస్తున్నారు.
ఎండాకాలంలో పుష్కలంగా తాగునీరు..
వేసవిలో సైతం ఇంటింటికీ సమృద్ధిగా తాగునీరు అందిస్తున్నారు. గతంలో నీటి కోసం ఎండాకాలంలో ఇండ్లను వదిలి గ్రామాలకు వెళ్లాం. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకంతో నేడు రెండు రోజులకు ఒక సారి నల్లా ద్వారా పుష్కలంగా నీరు అందిస్తున్నారు.
– రాగిరి భాగ్యమ్మ, దమ్మాయిగూడ ఓల్డ్ విలేజ్
గతంలో నీటి కోసం ఇబ్బందులు పడ్డాం..
గతంలో నీళ్ల కోసం చాలా ఇబ్బందులు పడ్డాం. నెలలో ఒక్కసారి మాత్రమే నీరు రావడంతో ట్యాంకర్ల కోసం పనులు వదిలి ఎదురుచూసేటోళ్లం. సీఎం కేసీఆర్ ప్రజల నీటి కష్టాలు చూడలేక మిషన్ భగీరథతో నేడు ఇంటి ముంగిటికే నల్లా ద్వారా కుటుంబానికి సరిపడా తాగునీరు సరఫరా చేస్తున్నారు.
– అదునూరి పుణ్యవతి, కుమ్మరి బస్తీ, నాగారం
ప్రజలకు సరిపడా తాగునీరు అందిస్తున్నాం
తాగునీటి సమస్యలను గుర్తించిన సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రజలకు సరిపడాతాగునీరు అందిస్తున్నారు. మున్సిపాలిటీలో గతంలో నీటి కష్టాలు ఎక్కువగా ఉండేవి. నేడు మిషన్ భగీరథతో 90 శాతం ప్రజల మంచినీటి కష్టాలు తీర్చాం. మిగిలిన పది శాతం పనులను రూ.18 కోట్లతో మున్సిపాలిటీలో 30 లక్షల లీటర్ల ట్యాంకుల నిర్మాణం జరుగుతుంది. 70 కిలో మీటర్లు పైపులైన్ పనులు పూర్తి చేసి 100 శాతం ప్రజల నీటి కష్టాలు తీరుస్తాం.
-కౌకుట్ల చంద్రారెడ్డి, మున్సిపల్ చైర్మన్, నాగారం