శేరిలింగంపల్లి, మే 20: కొండాపూర్ సెంట్రల్ పార్క్ పరిసర ప్రాంతాల కాలనీలకు తాగునీటి కష్టాలు తీరనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంజీరా నీటిని అందించేందుకు శ్రీకారం చుట్టారు. జలమండలి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి కాలనీల దాహార్తిని తీర్చుతున్నది. ముఖ్యంగా కొత్తగా ఏర్పడుతున్న నూతన కాలనీలకు సైతం తాగునీటిని సరఫరా చేసేందుకు చర్యలు విస్తృతం చేసింది.
రూ.9కోట్లతో 9 కాలనీలకు పైపులైన్ల నిర్మాణం
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని కొండాపూర్ మసీద్బండాలోని సెంట్రల్‌పార్క్ ఫేజ్-2 కాలనీ, శిల్పావ్యాలీ, శిల్పాగార్డెన్, క్రాంతివనం, రోలింగ్ మిడోస్, భాగ్యలక్ష్మీ నగర్, వసంత ఎస్టేట్స్, జేవీజీ హిల్స్, కేఎంఆర్ ఏస్టేట్స్ కాలనీలకు రూ.9 కోట్ల అంచనా వ్యయంతో తాగునీటి పైపులైన్ల నిర్మాణ పనులు చేపడుతున్నారు. శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్‌తో కలిసి స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఇటీవల శంకుస్థాపన చేశారు. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్ అండ్ సివరేజ్ బోర్డు(జలమండలి) అధ్వర్యంలో ఈ పనులు చేపడుతున్నారు. గచ్చిబౌలి, మాదాపూర్, నానక్‌రాంగూడ ఐటీ కారిడార్ ప్రాంతాలకు చేరువలోని కొండాపూర్ పరిసర ప్రాంతాల కాలనీలకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తూ తాగునీటి సమస్యలు లేకుండా సమస్య శాశ్వత పరిష్కారానికి అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది.