కుత్బుల్లాపూర్,మే20: ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు కుత్బుల్లాపూర్లో విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పరీక్ష కేంద్రంలో తీసుకోవాల్సిన పలు అంశాలపై మండల విద్యాశాఖాధికారి నేతృత్వంలో కో-ఆర్డినేటర్లకు ఇతరులకు శిక్షణ పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చారు. గత ఏడాది 11 పేపర్లు మాత్రమే ఉండగా ఈ ఏడాది ఆరు పేపర్లకు మాత్రమే కుదించడంతో విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కల్పించారు. నియోజకవర్గంలోని దుండిగల్, బాచుపల్లి, కుత్బుల్లాపూర్ మండలాల పరిధిలో మొత్తం 10,150 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరికి 57 సెంటర్లలో పరీక్షలు రాసేందుకు చర్యలు తీసుకున్నారు. ఒక్కో సెంటర్లో 150 నుంచి 180 మంది విద్యార్థులు పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేయగా ఒక్కో తరగతి గదిలో ఒక్కో బెంచీకి ఒక్కరి చొప్పున 12 నుంచి 15 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
పరీక్ష సెంటర్లో వసతుల కల్పన
విద్యార్థులకు పరీక్ష సెంటర్లో మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు రాసేందుకు కరెంటు, ఫ్యాన్లు, బెంచీలు, తాగునీరు, మరుగుదొడ్లు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. గతంలో 44 సెంటర్లు ఉండగా ఇప్పుడు కొవిడ్ నిభందనలను అనుసరించి ఒక్కో బెంచీకి ఒక్కరు చొప్పున కుర్చునేందుకు వీలుగా 57 సెంటర్లను ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో 20 ప్రభుత్వ పాఠశాలలతో పాటు మిగిలిన సెంటర్లను ప్రైవేట్ స్కూళ్లలో రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా 2, 3 కిలోమీటర్ల వ్యత్యాసంలోనే సెంటర్లను ఏర్పాటు చేశారు.
ప్రతి విద్యార్థి మాస్క్
విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి అంశాన్ని నిబంధనలకు అనుగుణంగా పరీక్ష సెంటర్లలో ఏర్పాట్లు చేశారు. కొవిడ్ నిబంధనలను సైతం పాటిస్తూనే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాలి. దీనికి తోడు ఐదు నిమిషాలు ఆలస్యమైన పరీక్ష కేంద్రం లోపలికి అనుమతించబోం.
-ఆంజనేయులు, ఎంఈఓ