జవహర్నగర్, మే 19: తండ్రి ఆశలకు ప్రతిరూపాలుగా నిలుస్తారనుకున్న చిన్నారులు కళ్లెదుటే కానరాని లోకాలకు వెళ్తుంటే.. చూడటానికి ఏ తండ్రికి ధైర్యం సరిపోతుంది. పిల్లలను సాహసం చేసి బతికించుకుందామనుకుంటే.. ఈత రాని ఆ తండ్రి అవిటి వాడిలా.. భూమ్యాకాశాలు మార్మోగేలా తల్లడిల్లిపోయాడు. భూ మండలం దద్దరిల్లేలా నెత్తి నోరు బాదుకున్నాడు. అయినా, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కన్న తండ్రి కళ్లెదుటే ఇద్దరు కుమారులు జల సమాధి అయ్యారు. విధి వారిని చెరువులో రూపంలో జల సమాధి చేసి వారి కుటుంబాల్లో పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. మల్కారం ఈదుల కుంట చెరువులో ఇద్దరు చిన్నారులు జల సమాధి అయ్యారు. ఈ ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.., జవహర్ నగర్ కార్పొరేషన్లోని మల్కారం ఫరానగర్లో నివసించే షేఖ్ అబ్దుల్ రహీమ్ ఆటో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి భార్య ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు.
గురువారం రహీమ్ ఇంట్లో ఉన్న మేకను తీసుకుని మల్కారం ఈదుల కుంట చెరువు సమీపానికి వెళ్లారు. అనంతరం, స్నానం చేసి బట్టలు ఉతుకుదామని తన ముగ్గురు కుమారులతో పాటు అక్క కుమారుడిని తీసుకెళ్లాడు. రహీమ్ బట్టలు ఉతుకున్న సమయంలో చెరువు గట్టు మీద ఉన్న మేక తెంపుకుని వెళ్లడంతో రహీమ్ మేక కోసం వెళ్లాడు. అదే సమయంలో రహీమ్ కుమారులు అబ్దుల్ అయాన్(09), అబ్దుల్ అలితాఫ్(07)తో పాటు అక్క కుమారుడు ముబిన్ చెరువులోకి దిగారు. ఈత రాక అయాన్, అలితాఫ్లు చెరువులో మునిగి మృతి చెందారు. అక్క కుమారుడు మాత్రం ఈత కొట్టుకుంటూ బయటపడ్డాడు. కళ్ల ముందే కుమారులు మునగడంతో ఈత రాక తండ్రి బయటే ఉండి గండెలవిసేలా రోదించాడు. దీంతో కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున కేకలు పెడుతూ స్థానికులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు గాలింపు చర్యలు చేపట్టి విగత జీవులైన ఇద్దరు చిన్నారులను వెలికితీశారు. ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందడంతో ఫరానగర్లో విషాదచ్ఛాయలు అలముకున్నాయి. ఈ మేరకు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి స్థానిక పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.