బోడుప్పల్, మే19: తెలంగాణలో నెలకొన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ఘనత అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో రూ.4కోట్లతో తాగునీటి అభివృద్ధి పనులను స్థానిక మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్తో కలిసి ప్రారంభించారు. నగర పరిధిలోని 13వ డివిజన్ దేవేందర్‌నగర్ కాలనీలో 20 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మించనున్న రిజర్వుడ్ వాటర్ ట్యాంక్‌కు భూమిపూజ చేశారు. అనంతరం 2వ డివిజన్ హిమగిరి కాలనీ, వీఎస్ఎస్డీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన పైపులైన్‌ను ప్రారంభించారు. నల్లాను ప్రారంభించి తాగునీరును కాలనీవాసులకు అందించారు.
నాగారంలో సమీకృత మార్కెట్‌కు శంకుస్థాపన
మేడ్చల్ కలెక్టరేట్: గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ అభివృద్ధి పెరిగిందని, మున్సిపాలిటీలు గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అనేక నిధులు కేటాయిస్తున్నారని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో రూ. 4.50 కోట్లతో చేపట్టిన సమీకృత మార్కెట్ నిర్మాణానికి గురువారం మంత్రి శంకుస్థాపన చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి మల్లారెడ్డికి స్థానిక కౌన్సిలర్ కౌకుట్ల అనంత్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రజలు ఇబ్బందులు పడకుండా మార్కెట్లు, వైకుంఠ ధామాలు, పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించారని, హరితహారంతో గ్రామాలు, పట్టణాలు పచ్చటితోరణాలుగా దర్శనం ఇస్తున్నాయని తెలిపారు. జూన్ 3 నుంచి నిర్వహించే పట్టణ ప్రగతిలో ప్రజాప్రతినిధులు, అధికారులు, అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి, కమిషనర్ ఎ.వాణిరెడ్డి, వైస్ చైర్మన్ మల్లేశ్, కౌన్సిలర్లు , కో- ఆప్షన్ సభ్యులు, అధికారులు, ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం..
నగరశివారు ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.1200 కోట్లు కేటాయించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని మంత్రి తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గంలో రూ.240కోట్లు ఖర్చుచేసి తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించామన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, వాటర్ వర్క్స్ జీఎం శ్రీనివాస్‌రెడ్డి, డీజీఎం కార్తిక్ రెడ్డి, మేనేజర్ మమత, స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.