మియాపూర్, మే 19 : ‘మన ఊరు మనబడి’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు సౌకర్యాల పరంగా మహర్దశ పట్టనుండటం అత్యంత సంతోషకరమని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా తొలి విడతలో ఎంపికైన 31 పాఠశాలల పురోగతికి తగు బడ్డెట్ను కేటాయించాలని ఆయన కోరారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో మన ఊరు మన బడి కార్యక్రమంపై గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహచర ఎమ్మెల్యేలు, విద్యాశాఖ అధికారులతో కలిసి విప్ అరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ చర్యల వల్ల ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు మంచి ప్రతిభతో ముందుకు సాగుతున్నాయని, మరిన్ని వసతులను కల్పించటం ద్వారా ప్రైవేటుకు పోటీగా నిలిచి తమ సత్తాను చాటుతాయన్నారు. మండల పరిధిలో నాలుగైదు ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా నమోదైందని, అదనపు సెక్షన్లతో కిటకిటలాడుతున్నాయని విప్ గాంధీ తెలిపారు.
అదనపు తరగతి గదులు, టాయిలెట్లు, కంప్యూటర్ ల్యాబ్లు, గ్రంథాలయం, తాగునీటి వసతి, ప్రహరీ నిర్మాణం సహా ఇతర మౌలిక వసతులను కల్పించటం ద్వారా పూర్తి స్తాయిలో ప్రయివేటు పాఠశాలల ప్రవేశాలకు మించి ప్రభుత్వ పాఠశాలలు విజయవంతంగా మంచి ఫలితాలతో ముందుకు సాగుతాయన్నారు. కాగా బడ్జెట్ పరంగా విప్ గాంధీ అభ్యర్థన పట్ల మంత్రి సబితా ఇంద్రారెడ్డి సానుకూలంగా స్పందించారు. ప్రతి రూపాయినీ పారదర్శకంగా ఖర్చుచేసి పాఠశాలలను మరింత బాగు చేసుకుంటామని సమావేశంలో ఆయన స్పష్టం చేశారు.