సుల్తాన్‌బజార్, జనవరి 21 : కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో త్వరలో కొవిడ్ సెంటర్‌గా వైద్య సేవలందించేందుకు కింగ్‌కోఠి జిల్లా వైద్య విధాన పరిషత్ ప్రభుత్వ దవాఖాన సిద్ధంగా ఉంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే దవాఖాన ఆవరణలోని నూతన భవనంలో కొవిడ్ సెంటర్‌ను ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఇటీవలే కింగ్ కోఠి జిల్లా దవాఖానలో సాధారణ ఓపీ సేవలను పునఃప్రారంభించి.. 13 విభాగాలతో పేద రోగులకు వైద్య సేవలను అందిస్తుది. కాగా.. థర్డ్ వేవ్ వ్యాప్తి వేగవంతం కావడంతో దవాఖానలో తిరిగి కొవిడ్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఆ దిశగా దవాఖాన పాలకవర్గం కృషి చేస్తుంది. గత రెండేళ్ళుగా కరోనా వ్యాప్తి విజృంభిస్తున్న తరుణంలో గాంధీ, కింగ్‌కోఠి జిల్లా దవాఖానలను పూర్తి స్థాయిలో కొవిడ్ కేంద్రాలుగా ప్రభుత్వం నిర్ణయించింది. గత యేడాది మార్చి 22 నుండి కింగ్ కోఠి జిల్లా దవాఖానలో సాధారణ ఓపీ సేవలను నిలిపి వేసిన విషయం విధితమే. గత యేడాది కాలంగా కొవిడ్ వైద్య సేవలను అందిస్తున్న దవాఖాన తిరిగి సాధారణ ఓపీ సేవలను ప్రారంభించేందుకు కసరత్తుకు శ్రీకారం చుడుతోంది.
జిల్లా దవాఖానలో ప్రజలకు అందించే సేవలు..
కింగ్ కోఠి జిల్లా దవాఖానలో గతేడాదిగా అందుబాటులో లేని ఓపీ సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్, గైనకాలజీ, ఈఎన్టీ, డెంటల్, గైనకాలజీ ఓబీజీ, ఫిజియోథెరపీ సేవలు అందుబాటులోకి వచ్చాయని సూపరింటెం డెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్ వివరించారు. కాగా.. థర్డ్ వేవ్ వ్యాప్తి నేపథ్యంలో తిరిగి దవాఖానలో కొవిడ్ సేవలు అందుబాటులోకి వస్తే సాధారణ ఓపీకి వచ్చే ప్రజలకు, కొవిడ్ నిమిత్తం వచ్చే రోగులకు ఇబ్బందులు కలుగకుండా పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
గైనకాలజీ విభాగం పూర్తిగా నిలిపివేత..
దవాఖానలో కొవిడ్ సేవలను ప్రారంభిస్తున్న తరుణంలో గైనకాలజీ విభాగంలో ప్రసవాలను పూర్తిగా నిలిపివేశారు. ఇదిలా ఉండగా సాధారణ సేవలను యథావిధిగా కొనసాగిస్తున్నట్లు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్ తెలిపారు. దవాఖానలోని నూత న భవనంలో కొవిడ్ సేవలు ప్రారంభం కాగా,పరిపాలనా భవనంలో సాధారణ ప్రజలకు ఇతర విభాగాల్లో వైద్య సేవలను, వ్యాక్సినేషన్‌ను, కొవిడ్ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు.