సిటీబ్యూరో, మే 13(నమస్తే తెలంగాణ)/ఎర్రగడ్డ: నగర సమస్యలపై గ్రేటర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమర శంఖం పూరించారు. ఇంతకాలం అభివృద్ధి, సంక్షేమ పథకాలతో నియోజకవర్గాన్ని ప్రగతి బాటలో పరుగులు పెట్టించడం, ఇంటి వద్ద, క్యాంపు కార్యాలయాల వద్దకు వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ వచ్చారు.తమ దృష్టికి రాకుండా ఉన్న చిన్న చిన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడం ద్వారా సమస్యల్లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దవచ్చన్న ఏకైక లక్ష్యంతో పాదయాత్రల కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ‘ప్రజా దర్బార్’ పేరిట సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటుంటే రెండ్రోజులుగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రభుత్వ యంత్రాంగాన్ని వెంటబెట్టుకొని డివిజన్లలో ఇంటింటికీ పాదయాత్ర చేపడుతున్నారు. రెండో రోజు బోరబండలో జరిపిన పాదయాత్రకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయా? లేదా? అని ఆరా తీయడమే కాకుండా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు. సైట్-3 కాలనీ, ఈ కాలనీ పరిసర ప్రాంతాల్లోని వీకర్ సెక్షన్ బస్తీలు, సైట్-2 కాలనీ, మొత్తం 10 బస్తీల్లోని అన్ని వీధులలో ఆయా శాఖల అధికారులతో కలిసి గోపీనాథ్ పర్యటించారు. ఎమ్మెల్యేల క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతున్నాయని, గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయంటూ ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
త్వరలో సీవరేజీ పనులు: ఎమ్మెల్యే
పాదయాత్రలో భాగంగా ఎమ్మెల్యే గోపీనాథ్ మాట్లాడుతూ బోరబండ డివిజన్లో ఉన్న సీవరేజీ సమస్యను తొలగించేందుకు రూ.2 కోట్లు మంజూరు చేయించామని, త్వరలో పనులు ప్రారంభం అవుతాయన్నారు. ఎస్పీఆర్ హిల్స్‌లో రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రిజర్వాయర్‌తో బోరబండ, రహ్మత్‌నగర్ డివిజన్లకు తాగునీటి సమస్య శాశ్వతంగా తొలగుతుందని పేర్కొన్నారు. బల్దియా డిప్యూటీ కమిషనర్ రమేష్, అధికారులు రాజ్ కుమార్, శ్రీనివాస్, విజయ కుమార్, రాజశేఖర్, సైదులు, శ్రావణ్, రాజేందర్, సాయితేజ, సందీప్ కుమార్, ఎమ్మెల్యే వెంట ఉన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, నేతలు విజయ కుమార్, ఏడీ మధు, శివ కుమార్ గుప్త, సరళ, ధర్మేంద్ర, డేవిడ్ పాల్గొన్నారు.