మలక్‌పేట, మే 13 : మలక్‌పేటలోని హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్లో పారిశుధ్యం పడకేసింది. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించకపోవడంతో కుప్పలు తెప్పలుగా పేరుకు కుళ్లి కంపు కొడుతుండగా, నిత్యం మ్యాన్‌హోళ్లు పొంగిపోయి రహదారులపై మురుగు పరుగులు పెడుతున్నది. సంబంధిత కాంట్రాక్టర్ వారానికి ఒకసారి కూడా చెత్తను ఎత్తకపోవడంతో మార్కెట్లో ఎటుచూసినా కుళ్లిపోయిన చెత్తకుప్పలే దర్శనిమిస్తున్నాయి. మరోవైపు మార్కెట్లో డ్రైనేజీ సమస్యను పరిష్కరించడంలో మార్కెట్ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దీంతో మార్కెట్లో రైతులకు, వ్యాపారులకు ఇబ్బందులు తప్పడంలేదు. దశాబ్దాల కిందట వేసిన పైపులైన్లు శిథిలావస్థకు చేరుకోవడం, పైపులైన్లలో సామర్థ్యానికి మించి మురికినీరు ప్రవహిస్తుండటంతో మార్కెట్లో నిత్యం మ్యాన్‌హోళ్లు పొంగిపోవడం సర్వసాధారణమైంది.
ఆదాయం వస్తున్నా.. వసతుల కల్పనలో విఫలం
మార్కెట్లో నిత్యం కోట్లాది రూపాయల క్రయ, విక్రయాలు జరుగుతూ మార్కెటింగ్ శాఖకు కోట్లాది రూపాయల ఆదాయం చేకూరుతున్నా, మార్కెట్లో మెరుగైన వసతులు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని రైతులు, వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో నిత్యం పొంగుతున్న మ్యాన్‌హోళ్లతో మురికినీటితో అటు రైతులు, ఇటు వ్యాపారులు నష్టపోతుండగా మార్కెట్‌కు వచ్చే కొనుగోలుదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలనుంచి తెచ్చే పంటలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, యూపీ తదితర రాష్ర్టాల నుంచి నిత్యం వేలాది టన్నుల ఉల్లిగడ్డ, మిర్చి, చింతపండు తదితర పంటను మార్కెట్‌కు తెస్తుంటారు రైతులు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్‌కు తేగా మ్యాన్‌హోళ్లు పొంగి మురికినీరు పంటలను ముంచెత్తుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు తెచ్చే పంటలతో మార్కెట్‌కు కోట్లాది రూపాయల ఆదాయం చేకూరుతున్నా, అధికారులు కనీస వసతులు కల్పించడంలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ట్యాక్స్‌లు చెల్లిస్తున్నా వసతులు కల్పించడంలేదు
ఏడాదికి కోట్లాది రూపాయల ట్యాక్స్‌లు చెల్లిస్తున్నప్పటికీ మార్కెట్లో జీహెచ్ఎంసీ అధికారులు గానీ, ఇటు మార్కెట్ అధికారులు గానీ కనీస వసతులు కల్పించడంలేదు. నగరంలోనే ప్రధాన హోల్‌సేల్ మార్కెట్ కావటంతో వ్యాపారులు, కొనుగోలుదారులతో నిత్యం మార్కెట్ కిక్కిరిసిపోతున్నది. ఏరులా పారుతున్న మురికినీరు పంటలను ముంచెత్తుతుండటంతో రైతులు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. పాత డ్రైనేజీలైన్లు తొలగించి కొత్తలైన్లు నిర్మించాల్సి ఉన్నా, అధికారులు ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం చేయటంలేదు. – చేగూరి వెంకటరమణ, ఉల్లిగడ్డ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు
డ్రైనేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు చేయిస్తున్నాం
మార్కెట్లో మురుగునీటి సమస్య చాలా కాలంగా ఉంది. దశాబ్దాల క్రితం నిర్మించిన లైన్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌తో మాట్లాడాం. శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, ఎస్టిమేషన్లు తయారు చేయాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అప్పటివరకు సమస్యను తాత్కాలికంగా పరిష్కరించాలని జీహెచ్ఎంసీ అధికారులను కోరాం. సోమవారం పైపులైన్లలో పూడికతీసి మురికినీరు సాఫీగా వెళ్లిపోయేలా చేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. – దామోదర్, మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి