అంబర్‌పేట, మే 13: సమస్యల పరిస్కారమే ధ్యేయంగా అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ శుక్రవారం బాగ్‌అంబర్‌పేట డివిజన్లో పాదయాత్ర నిర్వహించారు. అన్ని విభాగాల అధికారులతో కలిసి డివిజన్లోని అయ్యప్ప టెంపుల్ ఎదురు లేన్, పాములబస్తీ, బొంగుల గల్లీ తదితర ప్రాంతాలలో పర్యటించి ప్రజల నుంచి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పురాతనమైన డ్రైనేజీ వ్యవస్థ ఉండడంతో రెండు, మూడు రోజులకోసారి మ్యాన్‌హోళ్ల నుంచి డ్రైనేజీ పొంగిపొర్లుతుంటుందని చెప్పారు. పాములబస్తీ శ్మశానవాటిక వృథాగా ఉందని, దానికి ఆనుకొని ప్రమాదభరితంగా తయారైన కరెంటు ట్రాన్స్ఫార్మర్ను రోడ్డుపై నుంచి పక్కకు జరపాలని విన్నవించారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే శట్రాన్స్కో ఏఈ ని పిలిచి ట్రాన్స్ఫార్మర్ను స్మశానవాటిక లోపలకు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారానికి తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని డీజీఎంను ఆదేశించారు. జీహెచ్ఎంసీ, జలమండలి నుంచి ప్రత్యేక బడ్జెట్ తీసుకువచ్చి పనులు చేయిస్తున్నానని వివరించారు. ఈ కార్యక్రమంలో డీఈ సుధాకర్, వర్క్ ఇన్స్పెక్టర్ రవి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, నాయకులు కెంచె మహేశ్, కనివేట నర్సింగ్‌రావు, శివాజీయాదవ్, దారయోబు, సాయికుమార్, రమేశ్‌నాయక్, బస్తీ నాయకులు రావుల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రణాళికతో నాలా విస్తరణ పనులు
గోల్నాక: బాగ్‌అంబర్‌పేట మోహిన్ చెరువు నుంచి అంబర్‌పేట వాటర్ట్రీట్మెంట్ ప్లాంట్ వరకు రూ.22 కోట్ల భారీ వ్యయంతో చేపడుతున్న నాలా విస్తరణ పనులను పక్కా ప్రణాళికతో చేపడుతున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన బాపునగర్‌లో నాలా విస్తరణ పనులను కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలా విస్తరణ పనులు పూర్తయితే నియోజకవర్గ వ్యాప్తంగా వరదముంపు సమస్యకు మోక్షం కలుగనున్నదని తెలిపారు. అనంతరం ప్రేమ్‌నగర్‌లో ఆయన పాదయాత్ర చేశారు. స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్డీపీ సీఈ కిషన్, ఎస్ఈ భాస్కర్‌రెడ్డి, ఈఈ శ్రీనివాస్, డీఈలు వశీధర్, సువర్ణ, ఏఈలు కుశాల్, విఘ్జేశ్వరి, వర్క్ఇన్స్పెక్టర్ దుర్గ, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సిద్ధార్థ్ముదిరాజ్ పాల్గొన్నారు.
రిలీఫ్‌ఫండ్ చెక్కు అందజేత
కాచిగూడ: పేదలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కోరారు. నాగోల్ ప్రాంతానికి చెందిన ప్రవళ్లిక(35) రూ.25 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెలేయ అందజేశారు. ఈ కార్యక్రమంలో కుశాల్ పాల్గొన్నారు.