సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగాణ) : సిటీ కమిషనరేట్‌లో పని చేస్తున్న 17 వేల మంది సిబ్బంది హెల్త్ ప్రొఫైల్ నిర్వాహణకు ప్రత్యేక యాప్‌ను త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. పోలీస్స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలు ఆపై అధికారులు, సిబ్బందితో గురువారం సీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ వెస్ట్‌జోన్‌లో సిబ్బంది ఆరోగ్య పరిస్థితిపై సర్వే నిర్వహించడంతో 60 శాతం మంది డయాబెటిస్, బీపీ ఇతర వ్యాధులతో బాధపడుతున్నారని తేలిందన్నారు. దీంతో కమిషనరేట్ పరిధిలో పని చేసే 17వేల మంది సిబ్బందికి మొదట మాస్టర్ చెక్ అప్ చేసి, రోజు వారి డైట్, వ్యాయామాలు చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తూ యాప్ ద్వారా నిరంతరం పరిశీలిస్తామని చెప్పారు. ఆరోగ్య పరీక్షల్లో సిబ్బంది సతీమణులకు నిర్వహించి, ఈ ప్రక్రియలో వాళ్లను కూడా భాగస్వాములు చేస్తామని చెప్పారు.
సుల్తాన్‌బజార్ ఎస్‌హెచ్‌వో సస్పెన్షన్…
వ్యవస్థీకృత నేరాలు పెరుగుతున్నాయని గేమింగ్, హుక్కా, క్రాస్ మసాజ్ పార్లర్స్‌పై టాస్క్‌ఫోర్స్ కేసులు నమోదు చేస్తుందని, వీటిపై స్థానిక పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారని హెచ్చరించారు. సివిల్ తగదాలు ప్రోత్సహించడం, వ్యవస్థీకృత నేరాలపై దృష్టి పెట్టకపోవడంతో సుల్తాన్‌బజార్ ఎస్‌హెచ్‌వో బిక్షపతిని సస్పెండ్ చేశామని, ఇది అందరికి ఒక గుణపాఠంగా ఉంటుందని సీపీ సూచించారు. నకిలీ విత్తనాల సరఫరాపై నిఘా పెంచాలని సూచించారు. ఏసీపీ ఆపై స్థాయి అధికారులు తప్పనిసరిగా మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫిర్యాదుదారులకు అందుబాటులో ఉండాలన్నారు. వ్యక్తిగతంగా ఎవరికీ ర్యాలీ అనుమతులుండవని, ముందస్తు అనుమతులతోనే ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు. కార్డన్ అండ్ సెర్చ్ తిరిగి ప్రారంభించాలని అన్నిజోన్ల అధికారులను ఆదేశించారు. అనంతరం అదనపు సీపీలు చౌహాన్, శ్రీనివాస్, జాయింట్ సీపీలు రంగనాథ్, విశ్వప్రసాద్ వారి వారి విభాగాల గూర్చి మాట్లాడారు.
ట్రాఫిక్ సమస్యలపై జాయింట్ సీపీ సమీక్ష
ట్రాఫిక్ అధికారులతో జాయిం ట్ సీపీ రంగనాథ్ గురువారం సమీక్ష నిర్వహించారు. సిటీలో ఎయిర్ హారన్స్, బస్‌స్టాప్‌ల మధ్యలో బస్సులు ఆగతూ ట్రాఫిక్ ఇబ్బందులకు గురిచేయడం వంటి అంశాలతో పాటు ప్రధాన సిటీలో రూట్ల మళ్లింపు వంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.