మల్కాజిగిరి, మే 10: పిల్లలు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా కల్పిసున్నది. వేసవి సెలవులు కావడంతో అంగన్ వాడీ కేంద్రలు మూసి వేయడంతో వారి ఇండ్ల వద్దకే బాలామృతం, గుడ్లు అంగన్వాడీ టీచర్లు వెళ్లి అందజేస్తున్నారు.దీంతో వారికి సంక్రమంగా పౌష్టికాహారం అందుతుంది. అంతేకాకుండా తల్లిపాల ప్రాముఖ్యత గురించి గర్భిణులకు, బాలింతలకు అవగాహన కల్పిస్తున్నారు.
అల్వాల్‌లోని ప్రాజెక్ట్ ఇంటిగ్రేటడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కిం(ఐసీడీఎస్)ద్వారా అల్వాల్, మల్కాజిగిరి, ఉప్పల్, మేడిపల్లి, కాప్రా, ఘట్కేసర్ మండలాల్లోని 269అంగర్‌వాడీ కేంద్రాల ద్వారా 34,781మంది పిల్లలు, గర్భిణులు 4,562, బాలింతలు 4,058 మందితో కలిపి 43,401 మంది లబ్ధిపొందుతున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తలకు ప్రభుత్వం ప్రీస్కూల్ ట్రైనింగ్ ఇచ్చారు. అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న టీచర్లు పిల్లల సంరక్షణతోపాటు గర్భిణులు, బాలింతల ఆరోగ్యం మెరుగుపరచడానికి ఇంటింటికీ తిరిగి వారికి అవగాహన కల్పిస్తున్నారు. గర్భిణి ప్రసవించిన తర్వాత బిడ్డకు తల్లి పాలు తప్పకుండా పట్టాలి. ఇందు కోసం ప్రభుత్వం పిల్లలకు ‘బాలామృతం’ గర్భిణులకు ఇండ్ల వద్ద గుడ్లను అందజేస్తుంది.
సర్కారు దవాఖానల్లో ప్రసవాలపై అవగాహన కల్పిస్తున్నాం..
పిల్లలు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. పౌష్టికాహారంపై వైద్యులు, సిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పిస్తున్నాం. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు చేయించుకోవాలని అవగాహన కలిగిస్తున్నాం.
-ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు