సిటీబ్యూరో, మే 9(నమస్తే తెలంగాణ): హర్ష చెరుకూరి అలియాస్ వంశీకృష్ణ మంచోడు కాదు. అతడి మాయలో పడొద్దు. అతడు కల్లబొల్లి మాటలు చెప్పుతాడు. బోల్తా పడొద్దు.. అంటూ ముగ్గురు యువతులు ఇన్‌స్టాగ్రాంలో చాట్ చేసుకున్నారు. చివరకు ఎవరి గురించైతే మాట్లాడుకున్నారో అతడే వాట్సాప్ కాల్ చేసి, చాట్ చేసి అంతకుముందు ఇన్‌స్టాగ్రాంలో చాట్ చేసిన యువతినే బోల్తా కొట్టించాడు. ఆమె దగ్గర నుంచి రూ.6 లక్షలు కొట్టేశాడు. యువతి వెళ్లి నిలదీస్తే తన పేరు చెప్పుకొని.. నా స్నేహితుడు చేశాడంటూ బుకాయించాడు. దీంతో చేసేదిలేక సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. అయితే అతడి మోసాలు రూ.8కోట్లకు పైగానే ఉంటాయని సమాచారం.
కూకట్పల్లి కేపీహెచ్‌బీ ప్రాంతానికి చెందిన ఓ యువతి పేరొందిన సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలపర్‌గా పనిచేస్తున్నది. ఆమెతో పాటు మరో ముగ్గురు స్నేహితులు ఇన్‌స్టాగ్రాంలో వంశీకృష్ణ అలియాస్ హర్ష పేరుతో ఓ యువకుడు చాట్ చేస్తున్నాడని, అతను చాలా మంది యువతులను మోసం చేస్తున్నాడని చాటింగ్‌లో డిస్కస్ చేసుకున్నారు. అయితే ఈ చాట్‌ను సాఫ్ట్వేర్ డెవలపర్ యువతి పెద్దగా పట్టించుకోలేదు. కొద్ది రోజుల తర్వాత ఆమెకు వాట్సాప్‌లో వంశీ పేరుతో ఫోన్ వచ్చింది. తన పేరు వంశీ అలియాస్ హర్ష అని పరిచయం చేసుకున్నాడు. జూబ్లీహిల్స్‌లో నివాసముంటానని, ఏషియన్ పెయింట్స్ కంపెనీలో భాగస్వామినని నమ్మించాడు. మీ ఇన్‌స్టాగ్రాంను ఫాలో అవుతున్నాను.. మీరు నచ్చారు. మిమ్మల్ని పెండ్లి చేసుకుంటా.. అంటూ నమ్మించి పెండ్లికి ఒప్పించాడు.
వంశీకృష్ణ బాధితులు 250కి పైనే..
వంశీకృష్ణపై గతంలో ఈ తరహా ఫిర్యాదులు అనేకం ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. యువతులతో పాటు పలువురు వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులకు కూడా టోకరా వేశాడని తెలిసింది. ఈ డబ్బును హార్స్ బెట్టింగ్‌లతో పాటు విలాసాలకు ఖర్చు చేస్తాడని వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే వంశీకృష్ణ బాధితులు దాదాపు 250మందికి పైగా ఉంటారని సమాచారం. నిందితుడు వంశీకృష్ణను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేయగా, అధికారికంగా ధ్రువీకరించడం లేదు. వంశీకృష్ణ మోసాల విలువ సుమారు రూ.8 కోట్లు ఉంటుందని సమాచారం.
అర్జెంటుగా రూ.80 వేలు పంపించు
కొద్ది రోజుల తర్వాత వంశీ ఆ యువతికి ఫోన్ చేశాడు. నా బ్యాంక్ కార్డులన్నీ బ్లాక్ అయ్యాయి. కంపెనీలో వివాదాలు తలెత్తాయి. అర్జెంటుగా రూ.80 వేలు పంపాలని కోరాడు. ఇది నిజమని నమ్మిన యువతి డబ్బులు పంపింది. రెండు రోజుల విరామం తర్వాత రకరకాల కారణాలు చెప్పుతూ యువతి దగ్గర నుంచి మొత్తం రూ.6 లక్షలు కాజేశాడు.
డబ్బులన్నీ గుర్రపు పందాలకే
అనుమానం వచ్చిన యువతి డబ్బులు ఎవరికి పంపానని ఆరా తీసింది. డబ్బులన్నీ గుర్రపు పందాలు నిర్వహిస్తున్న గ్రూపులకు సంబంధించిన ఖాతాలకు వెళ్లినట్లు గుర్తించింది. ఈ విషయాన్ని తన సోదరుడికి చెప్పింది. ఓ రోజు వంశీని కలిసి నిలదీయగా.. తన పేరుతో తన స్నేహితుడు దార్నిశ్ చేశాడని, తనకు సంబంధం లేదని తేల్చి చెప్పాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి వంశీకృష్ణ అలియాస్ హర్షపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వెబ్విల్లీ సాఫ్ట్వేర్ పేరుతో.. రూ.4.82 లక్షలు టోకరా..
వైన్స్, నిత్యావసర సరకుల దుకాణాల నిర్వహణ కోసం ఓ సాఫ్ట్వేర్ అప్లికేషన్‌ను అందిస్తామని మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ కంపెనీ హైదరాబాద్‌కు చెందిన ఐటీ కన్సల్టెన్సీని బురిడీ కొట్టించింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం… కొండాపూర్ ప్రాంతానికి చెందిన ఐటీ టెక్నాలజీ, కన్సల్టెన్సీ సర్వీసెస్ నిర్వాహకులు పలు సంస్థలకు వివిధ రకాల సాఫ్ట్వేర్ అప్లికేషన్లను అందిస్తున్నారు. ఇటీవల వారికి వైన్స్, నిత్యావసరాల దుకాణాల నిర్వహణకు సంబంధించిన సాఫ్ట్వేర్ అప్లికేషన్ అవసరం పడింది. ఈ నేపథ్యంలో వారు మధ్యప్రదేశ్‌కు చెందిన వెబ్విల్లీ టెక్నాలజీ ప్రైవేటు లిమిటెడ్ సంస్థను వాట్సాప్, ఈ-మెయిల్స్ ద్వారా సంప్రదించారు. ఆ సంస్థ ఈ సాఫ్ట్‌వేర్‌ను అందించేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ బిజినెస్ రిక్వైర్డ్ డాక్యుమెంట్‌ను పంపింది. అందులో సాఫ్ట్వేర్ అప్లికేషన్ తయారీకి మొత్తం 8వేల డాలర్లు ఖర్చవుతుందని తెలిపారు. దీంతో కన్సల్టెన్సీ సర్వీసెస్ నిర్వాహకులు వెబ్విల్లీ టెక్నాలజీ సంస్థకు మొత్తం 4.82 లక్షలు చెల్లించారు. సాఫ్ట్వేర్ అప్లికేషన్ తయారవుతున్నదని వాయిదాలు వేసుకుంటూ ఆ తర్వాత స్పందించడం మానేశారు. దీంతో వెబ్విల్లీ టెక్నాలజీ సంస్థ మోసం చేసిందని బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఎస్బీఐ ఎటీఎం నుంచి రూ.4 లక్షలు స్వాహా
ఎస్బీఐ ఏటీఎం నుంచి గుర్తుతెలియని వ్యక్తులు అనధికారికంగా రూ.4 లక్షలు లావాదేవీలు జరిపారంటూ ముషీరాబాద్ ఎస్బీఐ శాఖ నుంచి సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్డు క్లోనింగ్ జరిగి ఉంటుందని బ్యాంకు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఏటీఎం కేంద్రంలో ఉన్న సీసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్ సరిగ్గా పనిచేయడం లేదని పోలీసులకు తెలిపారు. దీనిపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.