మేడ్చల్, మే 9(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకం ద్వారా దళితులకు చేయూతనిస్తూ, వారిని అన్ని రంగాల్లో ఎదిగేలా ప్రోత్సహిస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో దళిత బంధు పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు కీసర మండలం చీర్యాల్‌లో జయ మోహన్ గార్డెన్లో సోమవారం లబ్ధిదారులకు మంత్రి మల్లారెడ్డి, ఎ మ్మెల్యేలు కేపీ వివేకానంద్, బేతి సుభాష్ రెడ్డిలు వాహనాల ను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కలలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. దళితుల అభ్యున్నతికి ప్ర వేశపెట్టిన దళిత బంధు పథకం దేశానికే మార్గదర్శకంగా నిలిచిందని తెలిపారు. పథకంతో దళితుల కుటుంబాలలో వెలుగులు నిండుతాయ ని అన్నారు. దళితులతో పాటు ఎస్టీ, బీసీ, మైనార్టీ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు. దళితులను ధనవంతులుగా చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా సాగుతుందని, దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని మంత్రి మల్లారెడ్డి అభిలషించారు.
రెండో విడతలో రూ.17 వేల 700 కోట్లు
రెండో విడత దళితబంధు పథకం కింద ప్రభుత్వం రూ.17 వేల 700 కోట్లను బడ్డెట్లో కేటాయించినట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. రెండో విడత దళిత బంధు పథకాన్ని వచ్చే నెలలో ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రెండో విడతలో నియోజకవర్గానికి 2500 మందికి దళిత బంధు పథకాన్ని వర్తింపజేయనున్నట్లు పేర్కొన్నారు. విద్య విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని, మన ఊరు -మనబడి కార్యక్రమానికి రూ.7,331 కోట్లు కేటాయించిందని చెప్పారు. గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టిలైన పేద విద్యార్థులందరికి నాణ్యమైన విద్యను అందిస్తుందన్నారు.
95 మంది లబ్ధిదారులకు వాహనాలు..
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు చెందిన మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మల్కాజిగిరి, కూకట్పల్లి నియోజకవర్గాలకు చెందని 95 మంది లబ్ధిదారులకు మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, బేతి సుభాష్ రెడ్డిలు వాహనాల తాళాలను అందజేశారు. మిగతా లబ్ధిదారులకు మరో వారంలో రోజులలో వాహనాలను అందించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
దళితులను అభివృద్ధి పథంలో పయనించేలా..- ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
దళితులు అభివృద్ధి పథంలో పయనించే విధం గా రూపొందించిన పథకమే దళిత బంధు పథకమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అ న్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు ఆ కార్యక్రమాలను దళితవాడలో నుంచే మొదలు పెడుతున్నట్లు పేర్కొన్నారు. పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు.
దళితుల సంక్షేమమే.. ప్రభుత్వ ధ్వేయం- బేతి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే, ఉప్పల్
దళితులు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్వేయంగా పని చేస్తుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు. బడుగు బలహీన వర్గాల వర్గాల సంక్షే మం కోసం సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్న ట్లు పేర్కొన్నారు. లబ్ధిదారులు ఆర్థికంగా రాణించి దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలాజీ, మేయర్లు జక్క వెంకట్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, కొలను నీలా గోపాల్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, ఆర్డీవో రవి, మున్సిపల్ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు పాల్గొన్నారు.
కేసీఆర్‌కు రుణపడి ఉంటాం
దళితులకు అండగా ఉంటున్న కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. దళితుల జీవితాలలో కొత్త వెలుగులు నింపేందుకు ప్రవేశపెట్టి అందించిన దళితబంధును సద్వినియోగం చేసుకుంటాం. ఆర్థికంగా అభివృద్ధి చెంది ముఖ్యమంత్రి కేసీఆర్ కలలను నిజం చేస్తాం.
– వరలక్ష్మీ, కీసర
ముఖ్యమంత్రి ఆశయాన్ని నేరవేరుస్తాం
దళితుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాన్ని నేరవేరుస్తాం. దళితుల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి దళితులందరూ రుణపడి ఉంటారు. కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చి దళితుల కుటుంబాలలో వెలుగులను రాష్ట్ర ప్రభుత్వం నింపుతుంది.
– శ్రీరాం మహేశ్వరి, మల్కాజిగిరి
సంతోషంగా ఉంది
దళితబంధు పథకం కింద ట్రాక్టర్‌ను తీసుకోవడం సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధికి కృషి చేస్తుందనడానికి నిదర్శనమే దళితబంధు పథకం. దళిత బంధు ద్వారా రూ.10 లక్షలు అందించిన ప్రభుత్వానికి దళితులు రుణపడి ఉంటారు. దళితులపై నిజమైన ప్రేమ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉందని రుజువైంది.
– నాగేశ్, లాల్‌సాబ్‌గూడ