సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ): నిరుపేద రోగులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు నాణ్యమైన వైద్య పరీక్షల కోసం తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఇప్పటికే తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సెంటర్ల ద్వారా గ్రేటర్‌లోని బస్తీ దవాఖానల దగ్గర నుంచి జిల్లా దవాఖానల వరకు అన్ని రకాల ఆరోగ్య కేంద్రాల నుంచి రక్త నమూనాలు, మలమూత్ర నమూనాలను సేకరించి, వైద్యులు రాసిన పరీక్షలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు సైతం ఆన్లైన్ ద్వారా సంబంధిత ఆరోగ్య కేంద్రాలతో పాటు రోగి సెల్‌ఫోన్‌కు సైతం పంపుతున్నారు. ఈ రోజుల్లో చికిత్స కంటే.. పరీక్షలకే ఎక్కువ డబ్బు ఖర్చవుతున్నది. గతంలో కేవలం ఉస్మానియా, గాంధీ వంటి టీచింగ్ హాస్పిటల్స్‌లోనే రక్తం, ఇతరత్రా పరీక్షలు నిర్వహించే ల్యాబ్‌లు అందుబాటులో ఉండేవి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత దశల వారీగా వైద్య సేవలను విస్తరించారు. వైద్య పరీక్షలను సైతం తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా ప్రజలకు చేరువచేశారు. దీంతో ప్రస్తుతం బస్తీ దవాఖానలు, ప్రాథమిక, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా దవాఖానలు, జిల్లా దవాఖానల్లో సైతం అన్నిరకాల రక్త పరీక్షలను పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నారు.
ఏడాది కిందటే రేడియాలజీ ల్యాబ్‌లు:
గ్రేటర్ పరిధిలో ఏడాది క్రితమే రేడియాలజీ ల్యాబ్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో రెండు రకాల రేడియాలజీ ల్యాబ్‌లు ఉన్నాయి. 1.జిల్లా స్థాయి హబ్స్. ఇవి జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్నారు. 2. మినీ హబ్స్. ఇవి జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేశారు.
డిస్ట్రిక్ట్ హబ్స్: ఈ జిల్లా స్థాయి హబ్స్‌లో ఐదు రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. 2డీ -ఎకో, అల్ట్రాసౌండ్, ఈసీజీ, మమోగ్రామ్, ఎక్స్-రే పరీక్షలు నిర్వహిస్తారు. ఈ హబ్స్‌ను జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేయనున్నారు.
మినీ హబ్స్: మినీ రేడియాలజీ హబ్స్‌ను జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేశారు. మొత్తం 20 మినీ హబ్స్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించిన ప్రభుత్వం ఏడాది కిందట 8 కేంద్రాలను ప్రారంభించింది. మరో 12 రేడియాలజీ మినీ హబ్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు మొదలు పెట్టింది. అయితే, వీటిలో 10 కేంద్రాల నిర్మాణం పూర్తయ్యింది. వీటిని ఈనెల 11న మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నట్లు ఇటీవల జరిగిన దవాఖానల అభివృద్ధి పనుల కార్యక్రమంలో స్వయంగా మంత్రే ప్రకటించారు. కూకట్పల్లి, ఉప్పల్‌లోని యూపీహెచ్‌సీలలో ఏర్పాటు చేయనున్న రేడియాలజీ ల్యాబ్‌లకు సంబంధించి పనులు జరుగుతున్నాయి. పనులు పూర్తయిన వెంటనే వాటిని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
మినీ రేడియాలజీ ల్యాబ్ సేవలు:
మినీ హబ్‌లలో మూడు రకాల ప్రధాన పరీక్షలు నిర్వహించనున్నారు. అందులో అల్ట్రాసౌండ్ ఒకటి. ఈ పరీక్షలను ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు బయట రూ.2 వేల వరకు ఖర్చవుతుంది. ఇలాంటి ఖరీదైన స్కానింగ్‌లను మినీ హబ్స్‌లో పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నారు. గర్భిణీ మహిళలతో పాటు సాధారణ మహిళలు, వ్యక్తులకు సైతం ఈ సేవలు అందించనున్నారు. రెండవ పరీక్ష ఈసీజీ. మూడవది ఎక్స్-రే. ఈ సేవలను సైతం అందరికీ అందించనున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
ఈనెల 11న ప్రారంభం కానున్న రేడియాలజీ మినీ హబ్స్:
1. మలక్‌పేట ఏరియా హాస్పిటల్
2. కుషాయిగూడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
3. అల్వాల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
4. హయత్‌నగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్
5. రాజేంద్రనగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్
6. అమీర్‌పేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్
7. పటాన్చెరు ఏరియా హాస్పిటల్
8. గోల్కొండ ఏరియా హాస్పిటల్
9. శేరిలింగంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
10.నార్సింగి రూరల్ హెల్త్ సెంటర్