ఉస్మానియా యూనివర్సిటీ, మే 9: ఎనిమిదేండ్ల నరేంద్ర మోడీ పాలనలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్, ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ డీన్ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు ఆరోపించారు. ప్రొ. బండి బాలస్వామి మొదటి స్మారక ఉపన్యాసం కార్యక్రమాన్ని ఓయూ ఆర్ట్స్ కళాశాలలో సోమవారం నిర్వహించారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగం హెడ్ ప్రొ. కె. స్టీవెన్సన్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ప్రొ. పీఎల్ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ.. చట్ట సభల్లో సరైన విధంగా విధానపరమైన చర్చలు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మన న్యాయవ్యవస్థలో ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కారమయ్యేందుకు 425 ఏండ్లు పడుతుందని, అప్పటి వరకు నూతనంగా వచ్చే కేసులు అదనమని ఇటీవల వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సంపాదకీయంలో పేర్కొన్నారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ మాట్లాడుతూ.. ప్రొఫెసర్ బాలస్వామితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ. గణేశ్, మాజీ ఎమ్మెల్సీ ప్రొ. నాగేశ్వర్, ప్రొ. శ్రీనాథ్‌రెడ్డి, డా. సుధీర్ కుమార్, విద్యార్థి నాయకులు వల్లమల కృష్ణ, పడాల సతీశ్, మంద సురేశ్, గుండగాని కిరణ్ గౌడ్, రవి, శ్రీకాంత్, జంగయ్య, మిథున్, నాగేశ్వర్రావు, రవి నాయక్ పాల్గొన్నారు.