సుల్తాన్‌బజార్, మే 9: శంకరాచార్య ఒక మతానికి చెందిన వారు కాదని, ఆయన సిద్ధాంతాలు భారతదేశం అంతటా విస్తరించి ఉన్నాయని కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ప్రవచించారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహిస్తున్న జగద్గురు ఆది శంకరాచార్య జయంతి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఏకాదశ రుద్ర, మృత్యుంజయ హోమాలు, వంద మంది రుత్వికులతో చండీ పారాయణాన్ని ఘనంగా నిర్వహించారు. సాయంత్రం నిర్వహించిన ప్రవచన కార్యక్రమంలో పాల్గొన్న కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి భక్తులకు అనుగ్రహ భాషణం చేస్తూ ఆది శంకరాచార్య జయంతి ఉత్సవాల్లో భాగంగా వేద పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. భాగ్యనగరం (హైదరాబాద్)లో 170 మంది వేద పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. మాజీ డీజీపీ డాక్టర్ అరవింద్‌రావు మాట్లాడుతూ.. కర్ణాటక రాష్ట్రంలో ఆది శంకరా చార్య జయంతిని ‘ఫిలాసఫర్స్ డే’గా ప్రకటించి పండుగ జరుపుకొంటారని తెలిపారు. మాజీ ఐఏఎస్ ఎల్వీ. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ఉత్సవాలకు కంచి పీఠాధిపతి రావడంతో సభ పునీతమైందని తెలిపారు. అనంతరం ప్రవచన కర్త బ్రహ్మశ్రీ సామ వేదం షణ్ముఖ శర్మ ప్రవచించారు. ఈ కార్యక్రమంలో ఆది శంకర భక్త సమాజం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ శ్రీనివాస బంగారయ్య శర్మ, ఉపాధ్యక్షుడు టి. రమేశ్ గుప్త, కార్యదర్శి కేతినేడి సతీశ్, కోశాధికారి గుండా మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.