మన్సూరాబాద్, మే 9: మన్సూరాబాద్ డివిజన్ సహార గేటెడ్ కమ్యూనిటీ ఏరియాలో ఎన్నికల సందడి మొదలైంది. కాలనీ మెయింటెనెన్స్ కమిటీని ఎన్నుకునేందుకు నిర్వహిస్తున్న ఎన్నికలను రెండు పక్షాల వారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమ ప్యానెల్‌కు చెందిన సభ్యుల ద్వార సోమవారం నామినేషన్లు వే యించారు. ఈ ఎన్నికలకు రిటైర్డ్ డిప్యూటీ రిజిస్ట్రార్ కె. నరేందర్‌రెడ్డి ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నారు. కాలనీకి చెందిన 947 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నామినేషన్ల స్వీకరణ సోమవారం ముగిసింది. మంగళవారం నామినేషన్లను పరిశీలించనుండగా ఈనెల 11న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఇదే రోజు పోటీ చేయు అభ్యర్థుల వివరాలు, గుర్తుల కేటాయింపు ఉంటుంది. ఈనెల 22న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్.. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుందని ఎన్నికల అధికారి కె. నరేందర్‌రెడ్డి తెలిపారు.
వెంకటాద్రి ప్యానెల్… శ్రీకాంత్ అండ్ పార్థసారథి ప్యానెల్ మధ్యనే ప్రధాన పోటీ..
సహారా గేటెడ్ కమ్యూనిటీ ఏరియాలో జరుగుతున్న ఎన్నికలకు ప్రధాన పోటీ వెంకటాద్రి ప్యానెల్.. శ్రీకాంత్ అండ్ పార్థసారథి ప్యానెల్ మధ్యనే ఉండనుంది. ఇరు పక్షాలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పదిహేను రోజల నుంచే కాలనీలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రతి ఓటరును కలుసుకుని తమకు ఓటు వేయాలని వివరిస్తున్నారు. వెంకటాద్రి ప్యానెల్ నుంచి అధ్యక్షుడిగా ఎన్. సుదర్శన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎం. ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా వై. ప్రసాద్‌రావు, కోశాధికారిగా మంజులతో పాటు పన్నెండు మంది కార్యవర్గసభ్యుల పదవుల కోసం నామినేషన్ వేశారు. అదేవిధంగా శ్రీకాంత్ అండ్ పార్థసారథి ప్యానెల్ నుంచి అధ్యక్షుడిగా కరణం శ్రీ కాంత్, ప్రధాన కార్యదర్శిగా వల్లూరిపల్లి పార్థసారథి, ఉపాధ్యక్షుడిగా రాఘవేందర్, కోశాధికారిగా జగత్రెడ్డితో పాటు పన్నెండు మంది కార్యవర్గసభ్యుల పదవుల కోసం నామినేషన్ వేశారు.