సికింద్రాబాద్, మే 9: ‘ సమగ్ర విద్యతోనే జీవితాల్లో వెలుగులు నింపొచ్చు. నాగరికతకు విద్యే కొలమానం. అది విశ్వసించే సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్‌కు దీటుగా నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తున్నది’ అని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. చదువును పెట్టుబడిగా పెడితే ఉన్నత సాయికి అధిరోహించవచ్చని మహానేత బాబాసాహెబ్ అంబేద్కర్ నిరూపించారని గుర్తుచేశారు. విద్య, వైద్యరంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తుందన్నారు. సోమవారం కంటోన్మెంట్‌లోని మూడో వార్డు కార్ఖానా మడ్‌ఫోర్డ్ ప్రాథమిక పాఠశాలలో మన బస్తీ- మన బడి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సాయన్న ప్రారంభించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం సుమారు రూ.29.50లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దీంట్లో భాగంగానే కంటోన్మెంట్ వ్యాప్తంగా ఉన్న దాదాపు 20 పాఠశాలలను ప్రభుత్వం ఆధునీకరిస్తుందని వెల్లడించారు.
మన బస్తీ-మన బడి ఎంతో గొప్ప కార్యక్రమమని, దీనిని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. వచ్చే ఏడాది నుంచి అన్ని పాఠశాలలను ఇంగ్లిష్ మీడియంగా మార్చనున్నట్లు తెలిపారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే సాయన్న పరిశీలించారు.పాఠశాలలో సౌకర్యాల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ యాదయ్య, విజయ్‌కుమార్‌తో పాటు బోర్డు మాజీ సభ్యులు ప్రభాకర్, నేతలు నివేదిత, ముప్పిడి మధుకర్, రమేశ్, వసంత, విలాసిని, దర్శన్, సరిత, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆశీర్వాదం, సుప్రద తదితరులు పాల్గొన్నారు.