శేరిలింగంపల్లి, మే 9: గచ్చిబౌలి పరిసర ప్రాంతాలు అహ్లాదానికి నిలయంగా మారుతున్నాయి. రహదారిపై ప్రయాణించే వాహనదారులకు ఆకర్షణీయంగా దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా ఐటీకి నిలయమైన గచ్చిబౌలి ఐటీ కారిడార్ ప్రాంతాల్లోని ఫ్లైఓవర్, ఔటర్ జంక్షన్లను వివిధ డిజైన్లతో వినూత్నంగా రంగులద్దుతున్నారు. నిత్యం వాహనదారులతో కిక్కిరిసిపోయే ఇక్కడి కూడళ్లు ఆహ్లాదకర వాతావరణాన్ని వాహనదారులకు అందిస్తున్నాయి. ప్రధానంగా ఔటర్ జంక్షన్, గచ్చిబౌలి జంక్షన్, నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ప్రాంతాల్లో వినూత్నంగా వివిధ డిజైన్లతో రంగురంగులతో తీర్చిదిద్దిన కళాకృతులు అదనపు హంగులతో ఆకట్టుకుంటున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జాతీయ, బహుళ జాతీయ సాఫ్ట్వేర్ సంస్థలకు వేదికైన గచ్చిబౌలి ఐటీ పరిసరాలు అదేస్థాయిలో కొత్తశోభను సంతరించుకుంటున్నాయి.
పర్యావరణ ప్రాముఖ్యత ప్రధానాంశంగా..
పర్యావరణ ప్రాముఖ్యత ప్రధానాంశంగా అధికారులు గచ్చిబౌలి ఫ్లైవర్, బయోడైవర్సిటీ ఫ్లైఓవర్, ఔటర్ రింగ్‌రోడ్డు పరిసరాలను, ఐటీ కారిడార్ జంక్షన్లను అందంగా ముస్తాబు చేస్తున్నారు. ముఖ్యంగా గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ కిందభాగంలో సిమెంట్ పిల్లర్లను రంగురంగుల కళాకృతులతో అకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. పకృతి, పర్యావరణ ప్రాముఖ్యత, రకరకాల పక్షుల చిత్రాలతో చిత్రకారులు ఆహ్లాదకరంగా పెయింటింగ్ వేస్తున్నారు. చెట్ల యొక్క ప్రాముఖ్యతను చాటిచెబుతూనే ఆకర్షణీయ డిజైన్లతో వినూత్నంగా తీర్చిదిద్దారు. దీంతో పాటు నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ వరుణ్ మోటర్స్, కొకాపేట్ ఐటీసెజ్ జంక్షన్లో ఔటర్ కిందబాగంలో పలు థీంలతో అదనపు హంగులు అద్దుతున్నారు. పర్యావరణంతో పాటు ప్రాచీన, సంప్రదాయాలు ప్రతిభింబించేలా వివిధ డిజైన్లు, రంగురంగుల బొమ్మలు వేసి ప్రయాణికులు, వాహనదారులను ఆకుట్టుకునేలా ముస్తాబుచేశారు.