కుత్బుల్లాపూర్,మే9: హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణపై కొంపల్లి మున్సిపాలిటీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. 2020-21,2021-22లో హరితహరంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. ఒకవైపు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్న తరుణంలో మొక్కలకు ఎండిపోకుండా ప్రతి రోజూ వాటికి నీరును పడుతున్నారు.దూలపల్లి ఫారెస్టు అటవి తో పాటు ఎన్హెచ్-44 జాతీయ రహదారి పొడవునా,ఆయా కాలనీల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించేందుకు నాటిన మొక్కలకు పూర్తిస్థాయిలో సంరక్షణ కల్పించేలా తగు చర్యలు తీసుకుంటున్నారు. మొక్కల పరిరక్షణకు రెండు ట్యాంకర్ల ద్వారా ఉదయం సాయంత్రం నీరు పట్టడంతో పాటు ఆయా ప్రాంతాల్లోని వనాల్లో ఐదు బోర్ల ద్వారా, సెవరింగ్ మిషన్ల ద్వారా నీటిని సమృద్ధిగా పట్టేందుకు 25 మంది సిబ్బందితో తగు చర్యలు తీసుకుంటున్నారు.
సుందరీకరణ దిశగా పార్కులు..
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో దూలపల్లి పారిశ్రామిక వాడతో పాటు ఆయా కాలనీల్లో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరాణాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన గ్రీనరీ పార్కులను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలుగా తీసుకుంటున్నారు. వీటిలో కొంపల్లి పరిధిలోసెంట్రల్ పార్కు, ఎన్సీఎల్ పార్కు,న్యూ గ్రీన్ సిటీలో రెండు పార్కులు, అపర్ణపార్కు, ప్రియదర్శిని ఎంక్లేవ్తో పాటు నూతనంగా ఎన్హెచ్-44 ప్రధాన రహదారికి ఇరువైపులా, రోడ్డు మధ్యలో గ్రీనరీని అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు.
గ్రీనరీకి పెద్దపీట
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో గ్రీనరీకి పెద్దపీటను వేస్తున్నాం. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ఇప్పుడు చెట్లుగా ఎదుగుతున్నాయి.అనునిత్యం వాటి పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. మొక్కల సంరక్షణలో అందరి బాధ్యత ఉండాలి.
-జి.రఘు కమిషనర్, కొంపల్లి మున్సిపాలిటీ