గోల్నాక, మే 9: కరోనా మహమ్మారి నేపథ్యంలో గత రెండేండ్లుగా మూసిఉన్న స్విమ్మింగ్ పూల్ తిరిగి ప్రారంభించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. వేసవి శిక్షణ శిబిరాల్లో భాగంగా అంబర్‌పేట మున్సిపల్ మైదానంలోని స్విమ్మింగ్ పూల్ పునఃప్రారంభ కార్యక్రమానికి మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావుతో పాటు కార్పొరేటర్లు విజయ్‌కుమార్‌గౌడ్, దూసరి లావణ్యశ్రీనివాస్‌గౌడ్, పద్మావెంకట్‌రెడ్డి, ఉమారమేశ్యాదవ్, అమృత తదితరులతో కలసి సోమవారం స్విమ్మింగ్ పూల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అంబర్‌పేట మున్సిపల్ మైదానంలో నిర్మించిన స్విమ్మింగ్‌పూల్‌తో పాటు పిల్లల కోసం మినీ స్విమ్మింగ్‌పూల్‌ను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. దీంతో పాటు వేసవి శిబిరాల్లో భాగంగా అంబర్‌పేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మోడ్రన్ జిమ్‌లు, పార్కుల్లో ఓపెన్ జిమ్‌లను కూడా త్వరలోనే అందుబాటులోకి తెస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీఎంసీ వేణుగోపాల్, ఏఎంహెచ్‌వో జ్యోతి, డీఈలు సుధాకర్, సువర్ణ తదితరులతో పాటు డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సిద్ధార్థ్ముదిరాజ్, లవంగు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.