సిటీబ్యూరో, మే 8 (నమస్తే తెలంగాణ) : పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం ట్విట్టర్ వేదికగా నగర పౌరులతో సంభాషించారు. ఆస్క్ కేటీఆర్ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో హైదరాబాద్ అభివృద్ధిపైన, భవిష్యత్ కార్యక్రమాలను వివరించడంతో పాటు పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ భరోసా కల్పించారు. సమస్యను బట్టి ఆయా శాఖల ఉన్నతాధికారులు పరిష్కరించాలని సూచనలు చేశారు. పట్టణాభివృద్ధిలో భాగంగా అత్యంత మెరుగైన వసతులను కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని, అందులో భాగంగానే నిరంతర నాణ్యమైన విద్యుత్, తాగునీటి సరఫరాను పూర్తి స్థాయిలో చేపట్టామని తెలియజేశారు. కొత్త రోడ్ల నిర్మాణానికి ఎస్ఆర్డీపీ, ప్రస్తుతం ఉన్న రోడ్ల నిర్వహణకు సీఆర్ఎంపీ, నాలాల అభివృద్ధికి ఎస్ఎన్డీపీ కార్యక్రమాలు సమర్థవంతంగా చేపడుతున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నగరంలో మౌలిక వసతుల కల్పన అనేది నిరంతరం కొనసాగే కార్యక్రమం అని తెలిపారు. హైదరాబాద్ నగరం త్వరలోనే వంద శాతం మురుగు నీటి శుద్ధికరణ ప్లాంట్లను కలిగి ఉండబోతున్నదని, ఆ తర్వాత నగరంలోని హుస్సేన్‌సాగర్‌తో పాటు ఇతర చెరువులు కలుషితం అయ్యే అవకాశం తగ్గుతుందని చెప్పారు. నగరంలో ట్రాఫిక్ నిబంధనలు అమలు చేసేలా పోలీసులు ప్రయత్నం చేస్తారని, అంతిమంగా సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతయుతంగా ఉన్నప్పుడే సాధ్యమవుతుందని అన్నారు. నెటిజన్ల సంభాషణలో ముఖ్యమైనవి కొన్ని పరిశీలిస్తే…
అబ్దుల్ ఖుదీస్: ఐటీ రంగంలో పెట్టుబడులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టాలని వినతి
మంత్రి కేటీఆర్: తప్పకుండా చేపడతాం. ఇప్పటికే టాస్క్ పేరుతో నైపుణ్యం పెంపొందించే సంస్థను ఏర్పాటు చేశాం.
శంకర్ నాయక్: అరాంఘర్ చౌరస్తా నుంచి మిరాలం ట్యాంకు రహదారి విస్తరణ పనుల్లో 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న గుడిసెలను తొలగించారు. ఆదుకోవాలని వినతి
మంత్రి కేటీఆర్: తప్పకుండా.. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ద్వారా ఆ కుటుంబాలకు 2 బీహెచ్‌కే స్కీంలో పునరావాసం కల్పించే చర్యలు తీసుకుంటాం.
సంకల్ప్ గుప్తా: నగరంలోని రివర్ ఫ్రంట్, వాటర్ ఫ్రంట్ ప్రాజెక్టుల స్టేటస్ ఏంటీ?
మంత్రి కేటీఆర్: జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ శాఖలు పూర్తి స్థాయిలో వీటిపై దృష్టి సారించాయి. ఇప్పటికే కొన్ని చెరువుల సుందరీకరణ పనులను పూర్తి చేశాం.
మహేశ్ రెడ్డి: హైదరాబాద్‌లో డ్రైనేజీ వ్యవస్థ ఎప్పుడు మెరుగుపడుతుంది?
మంత్రి కేటీఆర్: ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు ద్వారా నాలాల అభివృద్ధి చేస్తున్నాం. ఈ పథకం ద్వారా పూర్తి స్థాయిలో డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తున్నాం. భవిష్యత్‌లో పెరిగే పట్టణీకరణ వల్ల వచ్చే ఎన్నో సవాళ్లను ఎదుర్కొనేలా తాము ప్రణాళికతో ముందుకు వెళుతున్నాం.
మోహన్‌రెడ్డి: వ్యర్థ పదార్థాల శుద్ధికి మా వద్ద సరికొత్త ప్రాజెక్టు ఉంది? దీనిపై ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం.
మంత్రి కేటీఆర్ : తక్షణమే పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్వింద్కుమార్ను సంప్రదించండి.
విటూస్: హుస్సేన్‌సాగర్ శుద్ధిపై ప్రభుత్వం ఏమి చేస్తున్నది?
మంత్రి కేటీఆర్: వచ్చే 10-12 నెలల్లో వంద శాతం హుస్సేన్‌సాగర్‌లోకి చుక్కా మురుగునీటిని రాకుండా చేస్తాం.
తేజ్-25: హైదరాబాద్‌లో వర్షాకాల సీజన్లో ఎదురయ్యే సమస్యలపై ఎలాంటి ప్లాన్ చేస్తున్నారు? పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు విషయంలో ఏమి చేస్తున్నారు?
మంత్రి కేటీఆర్: అర్బన్ ఇన్ఫ్రాపై ప్రత్యేక దృష్టి సారించి పనులు చేపడుతున్నాం. రోడ్ల అభివృద్ధికి ఎస్ఆర్డీపీ, నిర్వహణకు సీఆర్ఎంపీ పథకం చేపట్టాం. వరదల నివారణకు ఎస్ఎన్డీపీ పథకాన్ని అమలు చేస్తున్నాం.
ఐ శ్రవణ్: సంగీత్ జంక్షన్లో విపరీతమైన ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్నాం -ఈ సమస్యను పరిష్కరించండి
మంత్రి కేటీఆర్: ఎన్ఆర్డీపీ బృందం దీనిపై దృష్టి సారించి, పరిష్కారం చూపుతుంది.
వినయ్ ప్రశాంత్: కొండాపూర్ ఓయూ ప్రొఫెసర్ కాలనీలో తరచూ డ్రైనేజీ సమస్య ఉంది? దీనిపై దృష్టి పెట్టాలని వినతి
మంత్రి కేటీఆర్: ఈ సమస్యను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి దృష్టికి తీసుకువెళ్లి, ఈ సమస్యను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం.
సాయికిరణ్ యాదవ్: బీఆర్ఎస్ కోసం 2017 సంవత్సరంలో దరఖాస్తు చేసుకున్నాం. దీనిపై ఎలాంటి సమాచారం లేదు. దీనిపై స్పందించండి
మంత్రి కేటీఆర్: బీఆర్ఎస్ అంశం హైకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉంది? పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నాం.
ఎస్ఆర్కె: హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్లన్నీ ట్రాఫిక్ రద్ధీ సమస్యకు పరిష్కారం చూపుతాయని అనుకుంటున్నారా?
మంత్రి కేటీఆర్: గణనీయంగా పెరగుతున్న ప్రజా రవాణా వ్యవస్థకు ఫ్లై ఓవర్లు కొంత వరకు దోహదం చేస్తాయి.
మాధవి: జీడిమెట్లలో ఫాక్స్ సాగర్ చెరువు కట్ట రోడ్డు అధ్వాన్నంగా మారింది. దీనిని సుందరీకరణ చేసి పర్యాటక ప్రాంతం గా తీర్చిదిద్దాలని కోరుతున్నాం.
మంత్రి కేటీఆర్: తప్పకుండా ఈ విషయాన్ని కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత స్వయంగా పరిశీలించి సమన్వయం చేస్తుంది.
రాజన్న: హైటెక్‌సిటీ-ఎంఎంటీఎస్ స్టేషన్ వద్ద జరుగుతున్న పనులతో ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది. దీనిపై చర్యలు తీసుకోండి?
మంత్రి కేటీఆర్: ఈ సమస్యను జీహెచ్ఎంసీ సీసీపీ దేవేందర్ రెడ్డి పరిశీలించి చర్యలు తీసుకుంటారు.
దీపక్: అమీన్పూర్లో రోడ్డును అక్రమించి లలిత కన్స్ట్రక్షన్స్ నిర్మాణం చేపడుతుంది. దీని వల్ల రోడ్డు పూర్తిగా బ్లాక్ అవుతుంది. దీనిపై చర్యలు తీసుకోండి
మంత్రి కేటీఆర్: హెచ్ఎండీఏ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి చర్యలు తీసుకుంటారు.
జగన్నాథ్ ఇటిక్యాల: నాగోల్ ఫ్లై ఓవర్ ఎప్పటిలోగా పూర్తి అవుతుంది? వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
మంత్రి కేటీఆర్: దీనిపై కొన్ని రోజుల క్రితం సమీక్ష చేపట్టాం. వచ్చే ఆగస్టు నాటికి పూర్తి చేసే అవకాశం ఉంటుంది.
సల్మాన్: నగరవాసుల ఎన్నో రోజుల కల డబుల్ డెక్కర్ బస్సు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
మంత్రి కేటీఆర్: తప్పకుండా త్వరలోనే వస్తుంది. హెచ్ఎండీఏ, టీఎస్ ఆర్టీసీ సంస్థలు దీనిపై పనిచేస్తున్నాయి.
మీరా సంఘమిత్ర: నాగరాజు హత్యకేసు ప్రభుత్వ పరంగా బాధితురాలు అశ్రిన్కు అండగా నిలవాలని కోరింది.
మంత్రి కేటీఆర్: తప్పకుండా ఆ కుటుంబానికి అండగా నిలబడతాం. ఆమెను అవసరమైన అన్ని వసతులు సమకూర్చుతాం