కుత్బుల్లాపూర్, మే 8: మార్గం మధ్యలో వాహనంలోని పెట్రోల్ అయిపోతే నెట్టుకుపోవాల్సిన అవసరం లేదు. బ్యాటరీ సహాయంతో గమ్యస్థానాలకు చేరేలా సరికొత్త టెక్నాలజీని సెయింట్ మార్టిన్ కళాశాల విద్యార్థులు ఆవిష్కరించారు. దూలపల్లిలోని సెయింట్ మార్టిన్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ఆవిష్కరించిన సరికొత్త ఒరవడికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇటీవల ఉస్మానియా యూనివర్సీటిలో జాతీయ స్థాయిలో “ఇన్నోవేషన్ అండ్ టెక్నికల్ ఎక్స్పో-22”లో సెయింట్ మార్టిన్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. వాహనం పెట్రోల్‌పై అలాగే, బ్యాటరీని ఉపయోగించడం ద్వారా అదే ఛార్జి అవుతూ పెట్రోల్ అయిపోగానే, వెంటనే బ్యాటరీ సహాయంతో గమ్య స్థానాలకు చేరేందుకు వీలుగా కళాశాలకు చెందిన మెకానికల్ విభాగం విద్యార్థులు సరికొత్త బ్యాటరీ పరికరాన్ని ప్రయోగత్మకంగా ఆవిష్కరించి విజయం సాధించారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో గుర్తింపు ధ్రువీకరణ పత్రాన్ని సాధించగా, రూ.8 వేల నగదును పొందారు. కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మారెడ్డితో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.చంద్రశేఖర్ యాదవ్, కళాశాల ప్రిన్సిపాల్ డా.పి.సంతోష్ కుమార్ పాత్రలు విద్యార్థులను అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలను సాధించాలని ఆశించారు.