కందుకూరు, మే 8: దళితులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఒక్కో లబ్ధిదారుడికి ఉచితంగా రూ.10లక్షలు ఇస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ పథకం అమలు అవుతుండడంతో అబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొట్ట మొదట నియోజకవర్గానికి 100మందిని ఎంపిక చేస్తున్నారు. అందులో భాగంగా మండలంలో కొత్తగూడ, నేదునూరు, తిమ్మాపూర్, రాచులూరు, లేమూరు, మీర్ఖాన్పేట్, మాదాపూరు, బాచుపల్లి గ్రామాల్లో 50మందిని ఎంపిక చేశారు. వారు కోరుకున్న యూనిట్లకు నిధులు మంజూరు చేస్తున్నారు. మండలంలో ప్రస్తుతం 50మందిలో 12మందికి పైగా బ్యాంకు అకౌంటుల్లో డబ్బులు జమ అయ్యాయి. వీరితో పాటు ఒక్కొక్కరి బ్యాంకు అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. దీంతో లబ్ధిదారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయిం ది. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం కేసీఆర్ తమను ఆదుకుంటున్నాడని సంబుర పడుతున్నారు.
సీఎం కేసీఆర్ దళితుల పాలిట దేవుడు
రాష్ట్రం ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ దళితులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు. ఆయన దళితుల పాలిట దేవుడు. ఈ పథకంతో దళితులు ఆర్థికంగాఎదుతున్నారు. రూ.10లక్షలు ఇచ్చి తిరిగి చెల్లించ వద్దని చెప్పారు. గతంలో ఇలాంటి నిర్ణయం ఏ ప్రభుత్వం తీసుకోలేదు.
-ఉన్ని వెంకటయ్య, లబ్ధిదారుడు నేదునూరు
గత ప్రభుత్వాలు పట్టించకోలేదు
గతంలో తమను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. మొదటి సారిగా మా గ్రామంలో ఆరుగురిని ఎంపిక చేశారు. దళితులను చిన్న చూపు చూసిన ప్రభుత్వాలను చూశాం. కానీ దళితులను ఆదుకున్న ప్రభుత్వం టీఆర్ఎస్ మాత్రమే.
-మంద సాయిలు, సర్పంచ్ మాదాపూరు