గ్లాస్గో: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో రెండు రజతాలు లభించాయి. భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్, లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ వెండి పతకాలు అందుకున్నారు. ఆసియా గేమ్స్ కాంస్య పతక విజేత అయిన గుల్వీర్ కామన్వెల్త్ గేమ్స్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. పురుషుల 10 వేల మీటర్ల పరుగులో రజతం గెలిచి ఈ ఘనత సాధించిన భారత తొలి అథ్లెట్‌గా రికార్డులకెక్కాడు. మంగళవారం అర్ధరాత్రి వర్షంతో తడిచిన ట్రాక్‌పై ప్రతికూల పరిస్థితుల్లో సాగిన పరుగులో ఆరంభం నుంచి ముందంజలో ఉన్న గుల్వీర్ కొద్దిలో స్వర్ణం చేజార్చుకున్నాడు. 27 నిమిషాల 49.78 సెకండ్ల టైమింగ్‌తో రెండో స్థానం సాధించి సిల్వర్ ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియా రన్నర్ కై రాబిన్సన్ 27 నిమిషాల 48.93 సెకండ్లతో గోల్డ్ అందుకున్నాడు. 2023 వరల్డ్డ్ చాంపియన్‌షిప్ మెడలిస్ట్ డానియెల్ ఎబెన్యో (కెన్యా) సహా పలువురు మేటి ఆఫ్రికా రన్నర్లు బరిలో నిలిచిన పోటీలో గుల్వీర్ తెలివిగా పరుగెత్తాడు.
వర్షంతో ట్రాక్ తడిసినా రేసులో చాలా భాగం వరకూ ముందు వరుసలోనే ఉం డి చివరి స్టేజ్‌లో టాప్-3లోకి దూసుకొచ్చాడు. ఆఖరి క్షణాల్లో డేవిడ్ ముల్లార్కే (ఐల్ ఆప్ మా న్)ను వెనక్కునెట్టి రెండో స్థానం అందుకున్నాడు. ములార్కే (27 ని 50.28 సె) కాంస్యం గెలిచాడు. ఇక, పురుషుల లాంగ్‌జంప్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన మురళీ శ్రీశంకర్ అంచనాలను అందుకున్నాడు. బుధవారం అర్ధరాత్రి జరిగిన పోటీలో తన రెండో ప్రయత్నంలో 8.09 మీటర్ల దూరం దూకి రెండో స్థానం సొంతం చేసుకున్నాడు. కామన్వెల్త్లో అతనికిది రెండో సిల్వర్. గత ఎడిషన్‌లోనూ అదే పతకం గెలిచాడు. జమైకా జంపర్ తెజయ్ గేల్ అత్యధికంగా 8.15 మీటర్ల దూరంతో అగ్రస్థానంతో గోల్డ్ ఖాతాలో వేసుకోగా.. స్టీఫెన్ మెకంజీ (స్కాట్లాండ్) 8.08 మీటర్లతో కాంస్యం గెలిచాడు. మరో భారత అథ్లెట్ లోకేశ్ (7.97 మీ) ఐదో స్థానంతో సరిపెట్టాడు.
పూజ, సంజన నిరాశ
మహిళల హైజంప్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత అథ్లెట్, 19 ఏండ్ల పూజా సింగ్‌కు నిరాశే ఎదురైంది. తీవ్ర వర్షం మధ్య సాగిన ఫైనల్లో 1.82 మీటర్ల ఎత్తు దూకలేకపోయింది. ఆసియా చాంపియన్ అయిన పూజ తన తొలి కామన్వెల్త్ గేమ్స్‌ను పతకం లేకుండానే ముగించింది. ఇక, భారత్ పతకాల మోత మెగిస్తున్న వెయిట్‌లిఫ్టింగ్‌లో సంజన తీవ్రంగా నిరాశపరిచింది. మహిళల 77 కేజీల విభాగం ఫైనల్లో పోటీపడ్డ 19 ఏండ్ల సంజన స్నాచ్‌లో 94 కిలోల బరువును మూడు ప్రయత్నాల్లోనూ ఎత్తలేకపోయింది. ఫలితంగా పోటీని పూర్తి చేయలేకపోయింది.
సెమీస్‌కు అనిమేశ్
పురుషుల 200 మీటర్ల స్ప్రింట్‌లో నేషనల్ రికార్డ్ హోల్డర్ అనిమేశ్ కుజుర్ సెమీఫైనల్ చేరుకున్నాడు. బుధవారం జరిగిన హీట్-4లో 23 ఏండ్ల కుజుర్ 20.46 సెకండ్లతో అగ్రస్థానం, ఓవరాల్‌గా ఏడో స్థానం సాధించి సెమీస్ బెర్తు అందుకున్నాడు.
సజన్ ప్రకాశ్ ఫెయిల్
భారత స్టార్ స్విమ్మర్ సజన్ ప్రకాశ్ పురుషుల 200 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో ఫైనల్ చేరలేకపోయాడు. హీట్స్‌లో 1:51.99సె టైమింగ్‌తో 20వ స్థానంతో సరిపెట్టగా.. అనీశ్ (1:51.88 సె)18వ స్థానంతో హీట్స్‌లోనే ఇంటిదారి పట్టాడు. పురుషుల 50 మీటర్ల బటర్‌ఫ్లై, 200 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్లలోనూ సజన్ హీట్స్‌లోనే తన పోరాటం ముగించాడు. పారా స్విమ్మింగ్‌లో చైతన్య విశ్వాస్ కులకర్ణి, సుయాశ్ నారాయణ్ జాదవ్ ఎస్7 50 మీటర్ల ఫ్రీస్టయిల్ పోటీలో ఫైనల్లో అడుగు పెట్టారు. హీట్స్‌లో కులకర్ణి (32.77 సె), జాదవ్ (35.35 సె) హీట్స్‌లో 4, 6వ స్థానాల్లో నిలిచి ముందంజ వేశారు.
పంచ్ అదిరింది

మెగా ఈవెంట్లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. బుధవారం బరిలోకి దిగిన ఆరుగురు బాక్సర్లు క్వార్టర్ ఫైనల్లో గెలిచి సెమీస్ చేరడంతో భారత్‌కు మరో ఐదు పతకాలు ఖాయమయ్యాయి. సాక్షి, సచిన్ సివాచ్, అంకుశ్ యాదవ్, అరుంధతి చౌదరి, నరేందర్ కనీసం కాంస్యం ఖాయం చేసుకున్నారు. 51 కేజీ క్వార్టర్స్ పోరులో సాక్షి 5-0తో నార్తర్న్ ఐర్లాండ్‌కు చెందిన కైట్లిన్ ఫ్రైయర్స్‌ను చిత్తు చేయగా.. అరుంధతి (70కేజీ) 3-1తో హెండర్సన్ (న్యూజిలాండ్)పై, జైస్మిన్ లంబోరియా 4-1తో ఎలీస్ గ్లిన్ (ఇంగ్లండ్)పై కష్టపడి గెలిచారు. మెన్స్ 60 కేజీ బౌట్లో మాజీ వరల్డ్ యూత్ చాంప్ సచిన్ 5-0తో మొరెమి (బోస్తానా)పై ఏకపక్ష విజయం సాధించగా.. 80 కేజీ బౌట్లో అంకుశ్ కూడా 5-0తో జేడ్ మికాక్ (సేచెల్స్)ను చిత్తుగా ఓడించాడు. ఇక హోరాహోరీగా సాగిన 90+కేజీ క్వార్టర్స్‌లో నరేందర్ 3-2తో సెకో (సమోవా)పై చెమటోడ్చి విజయం సాధించాడు.
తుదిపోరుకు తజిందర్, సమర్దీప్

భారత స్టార్ షాట్ పుటర్ తజిందర్ సింగ్ తూర్, సమర్దీప్ సింగ్ ఫైనల్ రౌండ్‌కు క్వాలిఫై అయ్యారు. గోల్డ్ మెడల్ ఫేవరెట్ అయిన తజిందర్ క్వాలిఫికేషన్ రౌండ్ గ్రూప్-ఎలో గుండును 20.14 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు, 20 మీటర్ల ఆటోమేటిక్ క్వాలిఫికేషన్ మార్క్‌ను అధిగమించడంతో అతను మూడో త్రో చేయలేదు. ఇక గ్రూప్-బిలో సమర్దీప్ 19.95 మీటర్ల దూరం విసిరాడు. 15 మందితో పోటీలో ఓవరాల్‌గా 5వ స్థానంలో నిలిచి ఫైనల్ బెర్తు సాధించాడు. షాట్‌పుట్‌లో 20 మీటర్ల మార్కును దాటిన వారితో పాటు ఓవరాల్‌గా టాప్12లో నిలిచిన వారికి ఫైనల్ బెర్త్ లభిస్తుంది. గురువారం ఫైనల్ జరుగుతుంది.