సైదాబాద్, మే 8 : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన బస్తీ-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. సైదాబాద్ మండల పరిధిలోని 13 పాఠశాలలను ఎంపిక చేయగా…అందులో 6 ఉన్నత పాఠశాలలు, 7 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వం కేటాయించిన రూ. కోటి 84 లక్షల, 74 వేల 469 నిధులతో పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించనున్నారు. ఈ నిధులతో పాఠశాలల్లో బ్లాక్ బోర్డులు, కుర్చీలు, బెంచీ లు, తాగునీటి వసతి, మరుగుదొడ్ల ఆధునీకరణ, అదనపు గదులు, ప్రహరీ నిర్మాణాలు, పెయింటింగ్, క్రీడామైదానాల ఆధునీకరణ వంటి అభివృద్ధి పనులు చేస్తారు. ఇప్పటికే ఎంపిక చేసిన పాఠశాలల్లో సమస్యలు గుర్తించి, ప్రతిపాదనలు సిద్ధం చేసి విద్యాశాఖ ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. నివేదిక ప్రకారం విద్యాశాఖ , ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంతో మౌలికవసతుల కల్పనకు అవసరమైన నిధులు కేటాయించారు. నేడు పనులను ప్రారంభించనున్నారు.
పర్యవేక్షణ పాఠశాల కమిటీలదే…
మన బస్తీ-మన బడి కార్యక్రమంలో నిర్వహించే అభివృద్ధి పనులను పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) సభ్యులే పర్యవేక్షించాల్సి ఉంటుంది. పను లు మొదలు పెట్టిన రోజునుంచి పూర్తయ్యే వరకు పనుల పురోగతిపై పరిశీలించాలి. అలాగే అభివృద్ధి పనులకు సంబంధించి నాణ్యతాప్రమాణాలు, పనుల పురోగతిని జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు దృష్టి పెట్టి తనిఖీలు చేయాలి. పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యుల సూచనలు, అభిప్రాయాల మేరకే అభివృద్ధి పనులు కొనసాగనున్నాయి.
పాఠశాలలకు కొత్త అందాలు…
మన బస్తీ-మన బడి కార్యక్రమంలో ఎంపికైన పాఠశాలలకు కొత్త అందాలు సంతరించుకోనున్నాయి. ప్రభుత్వం 13 పాఠశాలలకు సంబంధించి అభివృద్ధి పనులకు రూ.కోటి 84 లక్షల, 74 వేల 469 నిధులు కేటాయించింది. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి అభివృద్ధి పనులు పూర్తయ్యే విధంగా ముందుకెళ్తున్నాం.
-విజయలక్ష్మి, ఉప విద్యాశాఖ అధికారి,సైదాబాద్ మండలం