ఖైరతాబాద్, మే 8 : వర్షా కాలం వచ్చిందంటే నాలాలు చెరువులుగా మారుతాయి. ఫలితంగా కాలనీలు, బస్తీలు ముంచెత్తుతాయి. ఖైరతాబాద్ సర్కిల్లో ప్రతి ఏడాది వర్షాకాలంలో ముంపు సమస్య వస్తున్నది. ప్రజలు ఇష్టారీతిలో వ్యర్థాలు నాలాల్లో పడేయడంతో పాటు సకాలంలో నాలాలు శుభ్రం చేయకపోవడం తదితర కారణాలతో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. ప్రతి ఏడాది నాలాలను శుభ్రం చేస్తున్నా, తిరిగి వర్షాకాలం వచ్చే సరికి పరిస్థితి మొదటికొస్తున్నది. ఈ నేపథ్యంలో ముందస్తుగా నాలాల పూడికతీతకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే సర్కిల్ 17లో నాలాల పూడికతీత పనులు అరవై శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
హిటాచీతో పనులు
బల్కాపూర్ నాలా పరీవాహక ప్రాంతాలతో పాటు కొన్ని కాలనీలు, బస్తీలు వర్షాకాలంలో ముంపునకు గురవుతున్నాయి. కారంపూడి బస్తీ-నాసర్‌స్కూల్, రాజ్‌భవన్ రోడ్డు, రాజ్‌నగర్ మీదుగా ఎస్టీపీ వరకు సుమారు 1.6 కిలోమీటర్లు రూ.18లక్షల వ్యయంతో నాలా పూడికతీత పనులు చేపట్టారు. గతంలో నాలాల్లో వ్యర్థాలు పడకుండా రిటైనింగ్ వాల్లు నిర్మించారు. అయినప్పటికీ వ్యర్థాలతో నిండిపోవడంతో వాల్‌ను కొంత భాగం తొలగించి అందులోని హిటాచీ వాహనాలను పంపి డీసిల్టింగ్ చేయిస్తున్నారు. సర్కిల్ పరిధిలోని నాలాల పూడికతీతకు రెండు హిటాచీ వాహనాలను వినియోగిస్తున్నాట్లు అధికారులు తెలిపారు. మే చివరి వరకు ప్రీమాన్సూన్, వానకాలం సీజ్ ప్రారంభం జూన్ నుంచి నవంబర్ వరకు పోస్టు మాన్సూన్ చేపడుతున్నట్లు వివరించారు.
రాజ్‌నగర్ వద్ద సిల్ట్‌ను క్లీన్ చేశాం
బల్కాపూర్ మేజర్ నాలా డీసిల్టింగ్తో వానకాలంలో సమస్య తలెత్తదు. రాజ్‌నగర్ వద్ద సిల్ట్‌ను పూర్తిగా క్లీన్ చేశాం. సర్కిల్ మొత్తంలో 60 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. పనుల్లో వేగం పెంచేందుకు నాలాల్లోకి హిటాచీ వాహనాలను పంపించి పారిశుద్ధ్య కార్మికుల చేత పూర్తి స్థాయిలో వ్యర్థాలను తొలగిస్తున్నాం. ఎండా కాలంలో పనులు ప్రారంభించి, నవంబర్ నెలాఖరు వరకు డీసిల్టింగ్ పనులు చేపడుతాం.
– చైతన్య, డీఈ, సర్కిల్ 17