Jubleehills by Poll | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ తుది జాబితాను ఆర్వీ కర్ణన్ ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో 2,08,561 మంది పురుషులు, 1,92,779 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత జూబ్లీహిల్స్లో 2,383 మంది ఓటర్లు పెరిగారని చెప్పారు.
ఇక తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకు రూ. 2.84 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. రూ. 3.69 లక్షల విలువ చేసే 512 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వ్యాప్తంగా మొత్తం 139 లోకేషన్లలో 407 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈ ఏడాది అక్టోబర్ 30వ తేదీన జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన తుది ఓటర్ల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. నాటి లెక్కల ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 3,98,982 మంది కాగా, ఇందులో పురుష ఓటర్లు 2,07,367 మంది, మహిళా ఓటర్లు 1,91,590 మంది, ట్రాన్స్జెండర్లు 25 మంది ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. గత ఎన్నికలతో పోల్చితే ఈ నియోజకవర్గంలో 1.61 శాతం మంది ఓటర్లు పెరిగారు. ఇక 80 ఏండ్ల వయసు పైబడిన వారిలో పురుష ఓటర్లు 3,280 మంది, మహిళా ఓటర్లు 2,772 మంది ఉన్నారు. 18 నుంచి 19 ఏండ్ల వయసున్న వారు 6,106 మంది ఓటర్లు ఉన్నారు. దివ్యాంగ ఓటర్లు 1,891 మంది ఉన్నారు. ఇందులో చూపులేని వారు 519, శారీరక వైకల్యం ఉన్న వారు 667, వినికిడి లోపం ఉన్న వారు 311, ఇతర వైకల్యం ఉన్నవారు 722 మంది ఉన్నారు. ఎన్నారై ఓటర్లు 95 మంది ఉన్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.