సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): ట్రాఫిక్ సమస్యల నుంచి గట్టెక్కించడంతో పాటు ట్రాఫిక్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు వాహనదారుడికి అందించేందుకు ‘తెలంగాణ ట్రాఫిక్ లైవ్ యాప్’ ప్రయాణికులకు చేదోడు వాదోడుగా ఉంటున్నది. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ప్రస్తుతం ఈ యాప్ అందుబాటులో ఉంది. దీనిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నారు.
ఈ యాప్ గూగుల్‌తో అనుసంధానమై ట్రాఫిక్ లైవ్ అప్డేట్స్ను అందిస్తున్నది. దీనికి తోడు వాహనదారుడికి అవసరమైన మరిన్ని ప్రయోజనాలను అందించేందుకు ఈ యాప్‌లో ఫీచర్లను జోడించారు. ఒక రూట్లో ట్రాఫిక్ రద్దీ ఉందంటే.. ఆ మార్గం మీదుగా కాకుండా ప్రత్యామ్నాయంగా అందుబాటులో ఉన్న అన్ని మార్గాల వివరాలను సూచిస్తుంది. దీంతో వాహనదారుడు అనుకున్న సమయానికి తమ గమ్యస్థానానికి చేరుకునేందుకు వీలు ఉంటుంది.
వాటర్ లాగింగ్ పాయింట్స్: వర్షా కాలంలో వాటర్ లాగింగ్ పాయింట్ల గురించి వాహనదారుడికి అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సమన్వయంతో పనిచేసి రోడ్లపై నిలిచే నీటిని వెంట వెంటనే తొలగించేందుకు ప్రయత్నిస్తుంటారు. అయినా.. కొన్ని చోట్ల సమయం ఎక్కువగా తీసుకుంటుంది. దీంతో ఆయా రూట్లలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది. వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కడున్నాయి.. ఆ రూట్లో ట్రాఫిక్ ఎలా ఉన్నది.. అనే విషయాన్ని తెలుసుకోవడంతోపాటు వెళ్లాల్సిన ప్రత్యామ్నాయ మార్గాలను కూడా సూచించే సమాచారం ఉంటుంది.