కేపీహెచ్‌బీ కాలనీ, ఆగస్టు 8 : ఎన్నో ఏండ్లుగా పేదలు ఎదురు చూస్తున్న సొంతింటి కల త్వరలోనే సాకారం కానున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు సొంతింటి కలను సాకారం చేయాలన్న లక్ష్యంతో రెండు పడక గదుల ఇండ్లు (డబుల్ బెడ్రూమ్) నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. నగరంలో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టగా నిర్మాణం పనులు చివరి దశకు చేరుకున్నాయి. గతంలోనే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు కోసం అర్హులైన పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి కావడంతో దరఖాస్తుదారుల్లో అర్హులైన వారిని గుర్తించే ప్రక్రియను చేపట్టారు.
దీనిలో భాగంగా జీహెచ్ఎంసీ సర్కిళ్ల వారీగా వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. దరఖాస్తులలో ఉన్న చిరునామాల ఆధారంగా ఇంటింటికి తిరిగుతూ సేకరించిన సమాచారాన్ని మొబైల్ ద్వారా ఆవాస్ యాప్‌లో నిక్షిప్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో కూకట్పల్లి జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దరఖాస్తుల పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. సర్కిళ్ల వారీగా దరఖాస్తుల పరిశీలనకు జీహెచ్ఎంసీ రెవెన్యూ, ప్రాజెక్టు, శానిటేషన్, వివిధ విభాగాల అధికారులు, సిబ్బందిని బృందాలుగా విభజించారు. నిర్దేశించిన కాలనీలలో ప్రతిరోజూ డబుల్ బెడ్రూం ఇండ్ల దరఖాస్తుదారుల వివరాలను సేకరించే పనులను అప్పగించారు.
దరఖాస్తుదారుల ఆధార్ కార్డు, ఫుడ్ సెక్యురిటీ కార్డు, ఓటరు ఎపిక్‌కార్డు వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం నివాసముంటున్న ఇంటి చిరునామా, ఫోన్ నంబర్‌ను అడుగుతూ కచ్చితమైన వివరాలను ఆన్లైన్ యాప్‌లో పొందుపర్చుతున్నారు. ప్రతిరోజూ ఇచ్చిన లక్ష్యం ప్రకారం దరఖాస్తులను పరిశీలిస్తూ వివరాలను ప్రత్యేక యాప్‌లలో నమోదు చేస్తున్నారు.
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దరఖాస్తుల పరిశీలనలో దళారుల మాటలు నమ్మి ఎవరికీ డబ్బులివ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ సిబ్బంది దరఖాస్తుదారుడి ఇంటికి వెళ్లి వివరాలను సేకరిస్తున్నారు. ఆధార్ కార్డు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు, ఓటరు కార్డును దగ్గర ఉంచుకుని సిబ్బంది అడిగిన వెంటనే చెప్పాలి. కేవలం దరఖాస్తుదారుల పూర్తి వివరాలను మాత్రమే సేకరిస్తున్నాం. ఆన్లైన్లో నిక్షిప్తం చేసిన వివరాలు ప్రభుత్వం వద్దకు వెళ్తాయి. పారదర్శకంగా అర్హులందరికీ ప్రభుత్వం ఇండ్లను కేటాయిస్తుంది.
– వి.మమత, జడ్సీ, కూకట్పల్లి జోన్