సిటీబ్యూరో, ఏప్రిల్11(నమస్తే తెలంగాణ): ఆన్లైన్లో ఆర్థిక మోసానికి పాల్పడిన రంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన దర్జీ ఉమామహేశ్వర్ అనే వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి సెయింట్ లూయిస్ కంపెనీకి సంబంధించి ఆన్లైన్ ఆర్థిక మోసానికి గురయ్యానంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.
గత సంవత్సరం జూలైలో ఎంఐఏ డ్యూరాండ్ అని చెప్పుకునే వ్యక్తి తనకు వాట్సాప్‌లో ఓ మెసేజ్ పంపారని, అతడు తాను సెయింట్ లూ యిస్ కంపెనీ ప్రతినిధిగా పరిచయం చేసుకుని, రోజువారీ అధికంగా రాబడి ఇస్తామంటూ హామీ ఇచ్చారని బాధితుడు తెలిపారు. ఒక వెబ్సైట్ ద్వారా క్రిస్టల్ ఉత్పత్తుల్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు ఇప్పిస్తామని ఒప్పించాడు.
ఈమేరకు అత డు పంపిన నకిలీ లింక్ ద్వారా మొత్తం రూ.10,58,330 పెట్టుబడి పెట్టానని , కానీ తర్వాత వెబ్సైట్ బ్లాక్ చేశారని బాధితుడు పేర్కొన్నాడు. తాను మోసపోయానని గ్రహించి, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారని పోలీసులు తెలిపారు. బాధితుడు పెట్టుబడి పెట్టడానికి నకిలీ దరఖాస్తు లింక్‌ను పంపిన కేసులో ఉమామహేశ్వర్‌ను అరెస్ట్ చేశామని సైబర్ పోలీసులు తెలిపారు.
మరో కేసులో ఢిల్లీకి చెందిన నీరజ్ అనే నిందితుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన 39ఏళ్ల వ్యక్తికి అతడి స్నేహితుడు కోస్టావెల్గ్రోన్ దరఖాస్తును పంపాడు. ఆ దరఖాస్తులో అతను డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అయ్యి డబ్బు సంపాదించడానికి పెట్టుబడి పెట్టా డు. మొదట్లో అతను దరఖాస్తులో ఇచ్చిన బ్యాంక్ ఖాతాల్లో చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టగా.. దానికి సైబర్ నిందితులు ప్రతిరోజూ కొంత లాభం చూపించారు.
బాధితుడికి లాభాల మొత్తాన్ని అతని అప్లికేషన్ వాలెట్‌లోకి స్వీకరిస్తామని, వాటిని అతడి వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలోకి తీసుకుని విత్ డ్రా చేసుకోవచ్చని చెప్పారు. ఇది నమ్మిన బాధితుడు మొత్తం రూ.6,16, 918 డిపాజిట్ చేశాడు. తర్వాత నేరగాళ్లు విత్ డ్రా చేసుకోకుండా ఆపేయడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈకేసులో ప్రధాన నిందితుడు నీరజ్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా, అతడిపై దేశవ్యాప్తంగా 88 కేసులున్నాయని, తెలంగాణలో 7కేసుల్లో అతని ప్రమేయముందని పోలీసులు తెలిపారు.