సిటీబ్యూరో, డిసెంబర్ 28(నమస్తే తెలంగాణ): మియా.. డ్రింక్ చేశావా.. అయితే స్టీరింగ్‌కు సలాం కొట్టి క్యాబ్ ఎక్కు..! మా డాడీ ఎవరో తెలుసా.. మా అంకుల్ ఎవరో తెలుసా.. ఆఫీసర్లను అలా అడగకు..మీ ప్రైవసీని మేం గౌరవిస్తాం.. వాహనం పక్కన పెట్టి, మీ డేట్ వచ్చాక కోర్టులోనే పరిచయం చేసుకుందా..! గూగుల్‌లో లాయర్‌ను వెతకడం కంటే.. క్యాబ్ కోసం వెతకడం మంచిది..!-ఇవీ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఎక్స్ వేదికగా చేస్తున్న ట్వీట్లు.
రెండు రోజులుగా డ్రంకెన్‌డ్రైవ్‌పై సీపీ చేస్తున్న ట్వీట్లు సోషల్‌మీడియా వేదికగా పెద్ద ఎత్తున వైరలవుతున్నాయి. నయాసాల్ వస్తుందంటే.. నగరంలో జోష్ ఎంతగా ఉంటుందో, పోలీసు పహారా కూడా అంతకు మించి ఉంటుందని సీపీ సజ్జనార్ చెప్పారు. మరో రెండురోజుల్లో కొత్త సంవత్సరం రాబోతున్న నేపథ్యంలో నగరంలో పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఎప్పుడూ లాఠీలు, డ్రంక్ డ్రైవ్ కేసులతో సీరియస్‌గా ఉండే పోలీసులు ఈసారి పంథా మార్చారు. లాఠీ దెబ్బల కంటే మాటల తూటాలే బలంగా పనిచేస్తాయని భావించారో ఏమో.. హైదరాబాద్ సీపీ సోషల్‌మీడియా వేదికగా వినూత్న ప్రచారానికి తెరలేపారు. ముఖ్యంగా సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై వ్యంగ్యంగా చేసిన మూడు ట్వీట్లు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి.
సాధారణ హెచ్చరికలకు భిన్నంగా, పక్కా హైదరాబాదీ యాసలో సజ్జనార్ చేసిన ట్వీట్లు యువతను ఆకట్టుకుంటున్నాయి. ‘మియా డ్రింక్ చేశావా.. అయితే స్టీరింగ్‌కు సలాం కొట్టి క్యాబ్ ఎక్కు’ అంటూ సలహా ఇస్తూనే.. గూగుల్‌లో లాయర్‌ను వెతకడం కంటే, క్యాబ్కోసం వెతకడం మంచిదని, కోర్టు మెట్లు ఎక్కవద్దంటూ చెప్పడం ఆలోచించేలా చేస్తుందని నెటిజన్లు చెబుతున్నారు. జైలుశిక్షలకు అయ్యే ఖర్చుతో పోలిస్తే క్యాబ్ఖర్చు చాలా తక్కువని, న్యూఇయర్ సంబరాలను కుటుంబసభ్యులతో, మిత్రులతో బాధ్యతాయుతంగా జరుపుకోవాలని డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే యాక్షన్ గ్యారెంటీ అని చెప్పారు.
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడగానే చాలామంది యువకులు పోలీసుల మీద ప్రతాపం చూపిస్తుంటారు. మా డాడీ ఎవరో తెలుసా.. మా అంకుల్ ఎవరో తెలుసా.. అంటూ తమ పరపతిని వాడే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సీపీ సజ్జనార్ తనదైన శైలిలో మీ పరపతి గురించి మా ఆఫీసర్లను అడగొద్దు.. మీ ప్రైవసీని మేం గౌరవిస్తాం కానీ వాహనం పక్కనపెట్టి కోర్టు డేట్ వచ్చాక కోర్టులోనే పరిచయం చేసుకుందాం అంటూ తాగి బండి నడిపితే జీరో టాలరెన్స్ మాత్రమే ఉంటుందని సజ్జనార్ ట్వీట్లో పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జీరో డ్రగ్స్ కోసం నగర పోలీసులు పకడ్బందీ ప్రణాళికలు రూపొందించారు. జీరో ఇన్సిడెంట్ కోసం లా అండ్ ఆర్డర్ అధికారులు, జీరో యాక్సిడెంట్ కోసం ట్రాఫిక్ అధికారులు, జీరో డ్రగ్స్ కోసం హెచ్‌న్యూ బృందాలు పనిచేస్తున్నాయి.
డ్రగ్స్ కట్టడికి పది క్లస్టర్లు, ఆరు డెకాయ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు హెచ్న్యూడీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. హెచ్‌న్యూ ఇన్స్పెక్టర్లు బాలస్వామి, డానియేల్ల నేతృత్వంలో 16 బృందాలు , ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు, నార్కోటిక్స్ డాగ్స్కాడ్లోని జాగిలాలతో కలిసి పబ్లులు, క్లబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నామన్నారు. మరోవైపు నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏడు ప్లాటూన్ల బలగాలతో 126 చోట్ల తనిఖీలు చేస్తున్నామని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. న్యూఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ తాగి వాహనాలు నడిపితే కఠినచర్యలు ఉంటాయని సజ్జనార్ హెచ్చరించారు.