CV Anand | చార్మినార్, జూలై 4 : షియా ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే మొహర్రం సంతాప దినోత్సవాలు ప్రశాంతంగా కొనసాగడానికి తగిన చర్యలు తీసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. మొహర్రం సంతాప వేడుకల్లో భాగంగా శుక్రవారం యాకుత్పురలోని బిబికా అలాంలో ప్రతిష్టించిన ఆలంలకు సీపీ దక్షిణ మండల డీసీపీ స్నేహ మెహ్రాతో కలిసి దట్టీలు సమర్పించారు. అనంతరం సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ..ఇరు వర్గాల వేడుకలు వెనువెంటనే వస్తున్నాయని, పర్వదిన నిర్వహణ కోసం క్షేత్ర స్థాయిలో ఇప్పటికే కసరత్తు నిర్వహించామని తెలిపారు. ఉత్సవాలు ప్రశాంతంగా కొనసాగడానికి తగిన సిబ్బందిని ఇతర ప్రాంతాల నుండి రప్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ జావీద్తోపాటు మీర్ చౌక్ ఏసీపీ శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.