బొల్లారం, ఏప్రిల్ 9: వీర హనుమాన్ విజయ శోభాయాత్ర ఏర్పాట్లను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పర్యవేక్షించారు. గౌలిగూడ నుంచి తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వరకు ర్యాలీ జరగనున్న ప్రాంతంలో జరుగుతున్న ఏర్పాట్లను హిందూ ధార్మిక సంఘాల నాయకులతో కలిసి పరిశీలించారు. రాష్ట్రస్థాయి వీహెచ్‌పీ భజరంగ్‌దళ్ నాయకులతో పాటు వివిధ శాఖల అధికారులతో సీవీ ఆనంద్ సమీక్షా సమావేశం నిర్వహించారు. శోభాయాత్ర సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. గత సంవత్సరం జరిగిన లోటుపాట్లను సరి చేసుకుంటూ ఈ ఏడాది శోభయాత్ర విజయవంతం అయ్యేవిధంగా కృషి చేస్తామని తెలిపారు.రహదారుల మరమ్మతులు, మంచినీటి సౌకర్యంతో పాటు పలు అంశాలపై సూచనలు చేశామని పేర్కొన్నారు. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 42 ర్యాలీలు శోభాయాత్రలో కలుస్తాయని చెప్పారు. సమయపాలన పాటిస్తూ శోభాయాత్రను విజయవంతం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
గౌలిగూడ నుంచి మొదలయ్యే శోభాయాత్రకు దాదాపు 17వేల మందితో పాటు 3 వేల మంది పోలీసు అధికారులతో పర్యవేక్షణ బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. నిర్వాహకులతో శోభాయాత్ర విషయంలో అన్ని విషయాలు చర్చించామనీ, ఈ ఏడాది ఘనంగా శోభయాత్ర విజయవంతం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.