సిటీబ్యూరో, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): దుర్గా నవరాత్రి ఉత్సవాల నిర్వాహకులకు హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. ఇకపై నగరంలో పెళ్లి బారాత్‌లు, రాజకీయ ర్యాలీలు, మతపరమైన వేడుకలు.. ఇలా ఏ కార్యక్రమమైనా డీజే వినిపించొద్దు. టపాసులు పేల్చుడు కనిపించొద్దు.. డీజేలు, ఫైర్ క్రాకర్స్‌పై నిషేధం విధిస్తూ సీవీ ఆనంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
నాలుగురోజుల క్రితం సీపీ ఆనంద్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అన్ని పార్టీల ప్రతినిధులు, మతపెద్దలు తమ అభిప్రాయాలు వెల్లడించారు. దసరా సమయంలో సిటీలో ఇప్పుడు పాట వినిపించదు.. క్రాకర్స్ పేలుళ్లు వినిపించవు. డయల్ 100 కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అందరితో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ వెల్లడించారు. భారీ శబ్దాలతో డీజేలు పెట్టి సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారన్న ఫిర్యాదులతో ఈ మార్గదర్శకాలు జారీ చేశారు.
పలు నిషేధాజ్ఞలు..
డీజే, సౌండ్ మిక్సర్, హైసౌండ్ ఎక్విప్మెంట్ పరికరాలపై నిషేధం విధిస్తున్నట్లు కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నాలుగు జోన్లలో సౌండ్ సిస్టమ్‌లు పెట్టడానికి డెసిబుల్స్‌ను నిర్దేశిస్తూ మార్గదర్శకాలు జారీ చేశారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందన్నారు. అనుమతి ఉన్న ప్రాంతాల్లో తక్కువ శబ్దంతో అనుమతి ఇచ్చారు.
జనావాసాల్లో ఉదయం 55 డెసిబుల్స్, రాత్రి 45 డెసిబుల్స్ సౌండ్స్ మించరాదన్నారు. ఆసుపత్రులు, స్కూళ్లు, కాలేజీలు, కోర్టు ప్రాంగణాలకు వంద మీటర్ల దూరంలో నిషేధం ఉంటుందని తెలిపారు. మతపరమైన ర్యాలీల్లో బాణాసంచా కాల్చడం పూర్తిగా నిషేధిస్తున్నామని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.