Hyderabad | హైదరాబాద్ : మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని మస్తాన్ నగర్లో శనివారం రాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మాదాపూర్ డీసీపీ కే శిల్పవల్లి ఆధ్వర్యంలో 100 మంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. కార్డన్ సెర్చ్‌లో భాగంగా రెండు బెల్ట్ షాపుల్లో తనిఖీలు నిర్వహించి, అక్రమంగా నిల్వ ఉంచిన 400 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బెల్ట్ షాపు నిర్వాహకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరిద్దరూ మద్యాన్ని ఎంఆర్పీ రేట్ల కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఇక అక్రమంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తున్న వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి ఇంట్లో నుంచి 10 చిన్న సిలిండర్లు, 2 పెద్ద సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. పెద్ద సిలిండర్ల నుంచి చిన్న గ్యాస్ సిలిండర్లను నింపి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆరుగురు రౌడీ షీటర్ల ఇండ్లను కూడా తనిఖీ చేశారు పోలీసులు.