సిటీబ్యూరో, ఫిబ్రవరి 2(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి దరఖాస్తుదారులు పోటెత్తారు. ఒకవైపు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హులను గుర్తించేందుకు అధికారులు వార్డుల్లోకి వెళ్తుంటే.., అర్హులేమో దరఖాస్తులు చేసుకోవడానికి కలెక్టరేట్‌కు క్యూ కడుతున్నారు. దీంతో అధికారులు ఇళ్ల వద్దకు వెళ్లి ఆరా తీయగా, దరఖాస్తు చేసుకోవడానికి కలెక్టరేట్‌కు వచ్చామని చెబుతున్నారు. దీంతో ప్రజా పాలన లబ్ధిదారులను గుర్తించడంలో గందరగోళం నెలకొంది.
ప్రజా పాలనలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ఫారాలతో వందలాది మంది ప్రజలు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. నగరం నలుమూలల నుంచి దరఖాస్తుదారులు రావడంతో కలెక్టరేట్ ప్రాంగణం కిటకిటలాడింది. దరఖాస్తులు స్వీకరించేందుకు అధికారులు నాలుగు కౌంటర్లను ఏర్పాటు చేశారు. వార్డు సభల్లో అధికారులు విడుదల చేసిన లిస్టులో తమ పేర్లు రాలేదని కొందరు, అధికారులు తమ వద్దకు సర్వే చేయడానికి రావడం లేదని మరికొందరు కలెక్టరేట్‌కు వచ్చి దరఖాస్తులను సమర్పించారు. తమ ఇరుగు పొరుగు వారి వద్దకు వచ్చిన అధికారులు.. తమ వద్దకు రాలేదని దరఖాస్తుదారులు చెబుతున్నారు.
అధికారులు ఇళ్ల వద్దకు… అర్హులు కలెక్టరేట్‌కు..!
అర్హులను గుర్తించేందుకు జీహెచ్ఎంసీ, పౌర సరఫరాల శాఖ అధికారులు వార్డుల్లోకి వెళ్తున్నారు. అటు లబ్ధిదారులేమో దరఖాస్తు ఫారాలు తీసుకుని కలెక్టరేట్‌కు వస్తున్నారు. దీంతో అధికారులు వెళ్లినప్పుడు అర్హులు ఇళ్ల వద్ద ఉండకపోవడంతో గందరగోళం నెలకొంటుంది. సర్వే కోసం అధికారులు వస్తున్నట్లు సమాచారం లేకపోవడం వల్ల కూడా అర్హులు ఇళ్లలో ఉండటం లేదని తెలుస్తున్నది. దీంతో అసలైన అర్హులు సర్వేలో పాల్గొనడం లేదని, తమకు అర్హత ఉన్నా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని వార్డుల్లో దరఖాస్తులు తీసుకోవడం లేదని చెబుతున్నారు. అధికారులు ఏ ప్రాంతంలో సర్వే చేస్తున్నారో ముందస్తుగా సమాచారం ఇచ్చి రావాలని కోరుతున్నారు.
ప్రభుత్వంపై నమ్మకం కుదరకనే…
గతంలో ప్రజా పాలన దరఖాస్తులు వార్డుల్లో సమర్పించినా వార్డు సభల్లో విడుదల చేసిన లిస్టులో తమ పేర్లు లేకపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. మరోసారి వార్డు సభల్లో దరఖాస్తు చేసుకున్నా ఫలితం ఉండదని భావించి కలెక్టరేట్‌కు వచ్చి అందజేస్తున్నామని చెబుతున్నారు. అర్హత ఉన్నప్పటికీ వార్డు సభల్లో తమ పేరు రాలేదని వాపోతున్నారు. నేరుగా కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే అర్హుల జాబితాలో పేరు వస్తుందని భావిస్తున్నారు. కలెక్టరేట్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకే దరఖాస్తులు తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఆ తర్వాత వస్తే వచ్చే సోమవారం రావాలని చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు.
ప్రజావాణికి 1975 దరఖాస్తులు
హైదరాబాద్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 1975 దరఖాస్తులు వచ్చాయని అదనపు కలెక్టర్లు కదివరన్ పలాని, ముకుంద రెడ్డి తెలిపారు. ప్రజలు అందజేసిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అత్యధికంగా గృహ నిర్మాణ శాఖకు 1279, రేషన్ కార్డుల కోసం 563, పింఛన్లకు 33, డీఈవో 7, రెవెన్యూ 7, పౌర సరఫరాలు 7, మైనారిటీ 4, వికలాంగుల శాఖ 4, సీపీఓ 1, జీహెచ్ఎంసీ 2, ఇతర శాఖలకు సంబంధించినవి 68 దరఖాస్తులు అందాయని వెల్లడించారు. కార్యక్రమంలో డీఆర్వో ఈ.వెంకటాచారి, ఆర్డీవో సాయిరాం, జిల్లా అధికారులు ఆర్.రోహిణి, జి.ఆశన్న, పవన్ కుమార్, కోటాజీ, డీఎంహెచ్‌వో వెంకటి, సుబ్రహ్మణ్యం, ఇలియాజ్ అహ్మద్, రాజేందర్, శ్రీరామ్, రమేశ్ పాల్గొన్నారు.
అధికారులు రాలేదు.. లిస్ట్‌లో పేరు లేదు
నేడు వికలాంగుడిని. 35 ఏండ్లుగా గోల్కొండలో అద్దె ఇంట్లో ఉంటున్నా. ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నా. వార్డు సభలో విడుదల చేసిన జాబితాలో నా పేరు రాలేదు. అర్హులను గుర్తించడానికి మా ఇరుగు పొరుగు వారింటికి వస్తున్నారు. కానీ, మా ఇంటికి రావడం లేదు. మూడు నెలలుగా కలెక్టరేట్‌కు వచ్చి దరఖాస్తులు సమర్పిస్తున్నా. నాకు ఇల్లు వస్తుందనే భరోసా మాత్రం ఇవ్వడం లేదు. దయచేసి ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితాలో నాపేరు చేర్చాలని అధికారులను వేడుకుంటున్నా.
– మహ్మద్ హబీబ్, గోల్కొండ;
వార్డుల్లో దరఖాస్తులు తీసుకోట్లేరు
రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే వార్డు సభలో తీసుకోలేదు. ఎమ్మా ర్వో, జీహెచ్ఎంసీ కార్యాలయాలకు వెళ్లి అడిగినా పట్టించుకోవడం లేదు. మా ప్రాంతంలో అధికారులు సర్వే చేయడానికి రావడం లేదు. నేరుగా కలెకర్టేట్లో దరఖాస్తు చేసుకుందామని వచ్చాను. ఇక్కడైనా దరఖాస్తు తీసుకుంటారని భావిస్తే.. సమయం ముగిసింది. వచ్చే సోమవారం రావాలని చెప్పారు.
– సంతోష్, ఈస్ట్ మారేడ్‌పల్లి;