సిటీబ్యూరో, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (హెచ్ సిటీ) ప్రాజెక్టుగా శ్రీకారం చుట్టారు. 58 చోట్ల పనుల్లో భాగంగా ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, ఆర్వోబీలు, ఆర్‌యూబీలు, రహదారుల విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఇందుకు రూ. 7032 కోట్లు ఖర్చు చేయనున్నారు.
28 ఫ్లై ఓవర్లు, 13 అండర్‌పాస్‌లు, నాలుగు ఆర్వోబీలు, మూడు చోట్ల ఆర్‌యూబీలు, పది చోట్ల రహదారుల విస్తరణ పనులకు గానూ టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాల్సి ఉండగా..నేటికీ టెండర్ దశలోనే ఉన్నాయి. 13 చోట్ల పనులకు టెండర్లు పిలవగా, వివిధ దశల్లో ఉన్నాయి. మరో 15 చోట్ల పనులకు టెండర్లు పిలిచేందుకు సన్నద్ధమవుతున్నారు. కాగా 30 చోట్ల పనులకు మాత్రం ప్రతిపాదన దశలోనే ఉండడం గమనార్హం. కాగా రూ. 780కోట్ల నిదులు ప్రభుత్వం ఇస్తే కానీ భూ సేకరణ ముందడుగు పడని పరిస్థితి నెలకొంది. మరోవైపు బడ్జెట్ కేటాయింపులో భాగంగా ఇటీవల రూ. 1300 కోట్ల మేర జీహెచ్ఎంసీకి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన హెచ్ సిటీ ప్రాజెక్టులో ఎలాంటి కదలిక లేకపోవడం గమనార్హం.
పేరు మార్చారు..్ర టాఫిక్ సమస్యను పెంచారు
‘హైదరాబాద్ నగరాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం…బడ్జెట్లో రూ.10వేల కోట్లకు పైగా నిధులు ఇచ్చాం…రూ. 7032 కోట్లతో హెచ్ సిటీ ప్రాజెక్టు ద్వారా 58 ప్రాజెక్టులు చేపడుతున్నాం..’ బడ్జెట్ కేటాయింపుల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన గొప్ప ప్రకటనలు..కానీ ఆచరణలో మాత్రం ఎక్కడ కూడా ప్రాజెక్టు పనులు పట్టాలెక్కలేదు.. 17 నెలల కాలంగా టెండర్ దశను దాటలేదు..
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ సమగ్ర అభివృద్ధి పేరిట కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ, సీఆర్ఎంపీ పథకాల స్థానంలో కాంగ్రెస్ సర్కారు ‘హెచ్ సిటీ’(హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్, ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్)కి రూపకల్పన చేసింది. ద్విగిజయంగా గత ప్రభుత్వ పథకాల పేర్లను సక్సెస్‌ఫుల్‌గా మార్చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. హెచ్ సిటీ ప్రాజెక్టు పనులపై ఆ స్థాయి ఫోకస్ పెట్టలేకపోయింది. ఫలితంగా జీహెచ్ఎంసీ పరిధిలో అభివృద్ధికుంటుపడింది. గడిచిన 17 నెలలకు పైగా ఒక్క కొత్త ప్రాజెక్టు ముందడుగు పడలేదు.
నాటికీ..నేటికీ ఎంతో తేడా..
గత కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ రవాణా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చి వాయు వేగంతో ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులను చేపట్టి చాలా ప్రాంతాల్లో సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేసింది. ఏటా రూ.600-700కోట్ల మేర నిధులను ఖర్చు చేసి ఫ్లై ఓవర్లు, ఆర్వోబీ, ఆర్‌యూబీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. .42 ఫ్లై ఓవర్లలో 37 చోట్ల ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన అధికారులు.. కేసీఆర్ హయాంలో 60 శాతానికి పైగా పూర్తి చేసుకున్న 23వ ఫ్లై ఓవర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. రూ.178 కోట్ల వ్యయంతో చేపట్టిన గచ్చిబౌలి శిల్పా లే అవుట్ ఫేజ్-2 ఫ్లైఓవర్ అందుబాటులోకి రానున్నది.
బంజారాహిల్స్ విరంచి దవాఖాననుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్ వరకు 200 ఫీట్ల మేర రహదారిని విస్తరించాలని నిర్ణయించారు. నిర్మాణానికి గానూ రూ. 150కోట్ల అంచనాతో టెండర్లు పిలిచారు. ప్రస్తుత టెండర్ ప్రక్రియ తుది దశలో ఉంది. 16 చోట్ల ఆస్తులను భూ సేకరణ విభాగం అధికారులు యాజమానులకు నోటీసులు జారీ చేశారు. మరో 16 చోట్ల ఆస్తుల స్వాధీనానికి యాజమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరికొన్ని చోట్ల ఆస్తుల స్వాధీనంలో గుర్తింపు ప్రక్రియ జరుగుతున్నది. ఇప్పట్లో భూ సేకరణ పూర్తి చేయడం కష్ట సాధ్యంగా మారింది.
రూ.1090 కోట్లతో కేబీఆర్ పార్కు చుట్టూ ఆరు జంక్షన్లలో అండర్‌పాస్‌లు స్టీల్ బ్రిడ్జిలకు టెండర్లు పూర్తి చేశారు. మొత్తం ఈ ప్రాజెక్టులో సేకరించాల్సిన 129కి పైగా ఆస్తుల్లో పట్టుమని 10 శాతం కూడా పూర్తి చేయలేదు. భూ సేకరణ ప్రక్రియపై బాధితులకు నోటీసులు జారీ చేస్తున్నామని, ఆరు నెలల్లో కొంత మేర క్లారిటీ వస్తుందని అధికారులు చెబుతున్నారు. భూ సేకరణపై స్పష్టత లేకుండానే టెండర్లు పిలిచి ఏజెన్సీకి కట్టబెట్టారు. భూ సేకరణపై స్పష్టత రాకపోవడంతో ఒప్పందంలో జాప్యం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, ఫిలింనగర్, మహారాజ అగ్రసేన్, క్యాన్సర్ దవాఖాన జంక్షన్ల వద్ద ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి బయటపడటం వాహనదారులకు సవాల్‌గా మారింది.